కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు.. రోజుకో గుడ్డు తినమని వైద్యులు చెప్తుంటారు. ఉడకబెట్టుకోని తిన్నా ఎలా తిన్నా.. గుడ్డు మంచిదే..కానీ గుడ్డు గుండెకు మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. ఇదేంటి అనుకుంటున్నారా..? కోడిగుడ్లలో మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, కొవ్వులు, లుటీన్, జియాజాంతిన్, లెచితిన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఎంతో ఉపయోగపడతాయి. అనేక వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తాయి.
కోడిగుడ్లలో కాల్షియం, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. రక్తహీనత నుంచి బయట పడేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి.. వాటిని తింటే గుండెకు హాని జరుగుతుందని.. కనుక వాటిని తినొద్దని కొందరు భావిస్తుంటారు. కానీ వాస్తవానికి గుడ్లను పరిమిత మోతాదులో తింటేనే గుండెకు మేలు జరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఈ విషయాన్ని బ్రిటిష్, చైనీస్ సైంటిస్టులు చేపట్టిన సంయుక్త పరిశోధనలో వెల్లడించారు.
5 లక్షల మందికి చెందిన వివరాలను సేకరించి వారు అధ్యయనం చేశారు. పరిమిత మోతాదులో గుడ్లను తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని.. గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆ సైంటిస్టులు వెల్లడించారు. కోడిగుడ్లను ఎవరైనా సరే నిర్భయంగా తినవచ్చు. అందులో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ దాంతో ఎలాంటి హాని కలగదని అంటున్నారు. అయితే.. కోడిగుడ్లను అధిక మోతాదులో మాత్రం తినరాదు. రోజుకు ఒక గుడ్డు తినవచ్చు. అంతకు మించితే మాత్రం గుండెకు హాని కలుగుతుందని చెబుతున్నారు.
ఇక గుండె జబ్బులు ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు కోడిగుడ్డులోని పచ్చసొన తీసి తినాలని సూచిస్తున్నారు. దీంతో ఎలాంటి హాని కలగదని, ఆరోగ్యంగా ఉండవచ్చని, గుడ్డులోని పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో.. దాన్ని సరైన రీతిలో తినకపోతే.. అంతే నష్టం జరుగుతుంది. ముఖ్యంగా.. ఉడకబెట్టిన గుడ్డును తినేవాళ్లు.. గుడ్డును ఉడికించిన వెంటనే తినాలి. అలా కాకుండా.. గంటలతరబడి ఉంచితే.. నష్టం కలుగుతుంది. దానిపై తెలియని బాక్టీరియా ఏర్పడుతుంది.