ఆ నలుగురు..అవును నలుగురే ఇప్పుడు ఏపీ రాజకీయాలని మార్చేశారు. గెలుపోటములని తారుమారు చేశారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఆ నలుగురు గురించే మాట్లాడుకుంటున్నారు..అసలు ఎవరా ఆ నలుగురు..ఏం చేశారనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ నలుగురు అంటే రెండు రకాలుగా ఉన్నారు..టీడీపీ రెబల్స్…వైసీపీ రెబల్స్. అవును వాళ్ళు నలుగురే..వీళ్ళు నలుగురే. వీరితోనే ఇప్పుడు ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి షాక్ ఇద్దామనుకుని వైసీపీ నలుగురు టిడిపి రెబల్ ఎమ్మెల్యేలని నమ్ముకుంది..కానీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి టిడిపి..వైసీపీకి షాక్ ఇచ్చింది.
తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 6 స్థానాలు వైసీపీ, ఒక స్థానం టిడిపి గెలుచుకుంది. అయితే 6 స్థానాలు గెలిచిన వైసీపీలో ఆనందం లేదు..ఒక స్థానం గెలిచిన టిడిపి సంబరాలు చేసుకుంది. ఎందుకంటే అలాంటి పరిస్తితి ఒకటి వచ్చింది. వైసీపీ తీసుకొచ్చింది. తమకు బలం ఉందని చెప్పి వైసీపీ 7 స్థానాల్లో తమ అభ్యర్ధులని నిలబెట్టింది.
నిజంగానే వైసీపీకి బలం ఉంది. వాస్తవానికి వైసీపీ అసలు బలం 151..టిడిపికి 23, జనసేన 1. అయితే టిడిపి నుంచి నలుగురు, జనసేన ఒక ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లారు. దీంతో వైసీపీ బలం 156…ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి..అంటే 154 చాలు. అయితే ఇద్దరు ఎలాగో వైసీపీ రెబల్స్ అయ్యారు. ఆనం, కోటంరెడ్డిలు వైసీపీకి దూరమయ్యారు. సరే వారు దూరమైన 154 బలం ఉంది కాబట్టి..7 స్థానాలు గెలిచేస్తామని వైసీపీ అంచనా వేసింది.
ఇక టిడిపి గెలిచింది 23..కానీ నలుగురు వైసీపీకి వెళ్ళడం వల్ల..అసలు బలం 19..ఇటు వైసీపీ రెబల్స్ ఇద్దరినీ కలుపుకుంటే 21..అంటే టిడిపి గెలవడానికి ఇంకో ఎమ్మెల్యే కావాలి..అనూహ్యంగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటు వేశారు. దీంతో టిడిపి అభ్యర్ధికి 23 ఓట్లు పడ్డాయి..పంచుమర్తి అనురాధ గెలిచారు. ఇక వైసీపీలో 5 గురు అభ్యర్ధులకు 22 ఓట్లు చొప్పున పడ్డాయి. దీంతో వారు గెలిచారు. ఇద్దరికి మాత్రం 21 ఓట్లు చొప్పున పడ్డాయి. దీంతో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించగా..టిడిపికి మొదట ప్రాధాన్యత ఓటు వేసిన ఒక ఎమ్మెల్యే..రెండో ప్రాధాన్యత ఓటు వైసీపీ అభ్యర్ధి జయమంగళ వెంకటరమణకు వేశారు. దీంతో ఆయన గెలిచారు. కోలా గురువులు ఓడిపోయారు. మొత్తానికి అటు నలుగురు, ఇటు నలుగురు మారారు..కానీ విజయం టిడిపికి దక్కింది.