టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆదివారం 58వ రోజుకు చేరుకుంది. అయితే.. ఈ నేపథ్యంలో నేడు పాదయాత్ర ధర్మవరం నియోజకర్గంలో ఉత్సాహంగా సాగింది. ధర్మవరం నియోజకవర్గంలో వరుసగా రెండోరోజూ కూడా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దారివెంట అడుగడుగునా మహిళలు లోకేశ్ కు నీరాజనాలు పలుకుతూ ఘనస్వాగతం పలికారు. బత్తలపల్లి ప్రధాన రహదారి జన ప్రవాహంతో కిటకిటలాడింది.
బత్తలపల్లిలో ప్రజలు అపూర్వ స్వాగతం పలుకగా, అదే సమయంలో లోకేశ్ పైన పోలీసు డ్రోన్ ఎగిరింది. ఈ సమయంలో ఆగి సెల్ఫీ దిగిన లోకేశ్… అయ్యా జగన్ గారు మీరు నన్ను చూడాలి అనుకుంటే మీకు యూట్యూబ్ లైవ్ లింక్ పంపిస్తా అంటూ డ్రోన్ ఎగురుతున్న వీడియో విడుదల చేశారు.
ఉప్పలపాడు రీచ్ నుంచి వెళ్తున్న ఇసుక టిప్పర్ల ఎదుట సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు అని విమర్శించారు.
“నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గుట్ట, చెరువులను ఆక్రమించి చేసిన కబ్జాలు చూపించాను. ఈ రోజు ఉదయం చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా చూపిస్తున్నాను. జనాల్ని ఏమార్చేందుకు గుడ్ మార్నింగ్ డ్రామా, మూడు పూటలా చేసేవి కబ్జాలు-దందాలు. డ్రామాలన్నీ బట్టబయలయ్యాయి. బ్యాడ్ మార్నింగ్ టూ ఎమ్మెల్యే కేతిరెడ్డి” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.