టీపీసీసీ రేవంత్ రెడ్డికి తనపై నిరాధార ఆరోపణలు చేశారని, టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడం జరిగింది. తనపై చేసిన ఆరోపణలకు గాను బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఆ నోటీసుల్లో తెలిపారు. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ ఆ నోటీసుల్లో వెల్లడించారు. ఇక తాజాగా కేటీఆర్ నోటిసులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నోటీసులకు నోటిసులతోనే కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తనకి ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణలో టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ లీకేజీలో ప్రభుత్వ నిర్లక్ష్యం, మంత్రి కేటీఆర్ హస్తం ఉందని రేవంత్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్ వెల్లడించారు. ఈ నేపధ్యం లో దానికి సంబంధించిన ఆధారాలు అప్పగించాలని సిట్ వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు వారిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్. ఈ క్రమంలో ఇటీవల టీపీసీసీ బృందం పేపర్ లీకేజీపై ఈడీ ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్ వచ్చిన సొమ్మును హవాలా రూపంలో విదేశాలకు తరలించారని..అందుకే తాము ఈడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.