పుష్ప 2లో బన్నీ లుక్‌కి తిరుపతి జాతరకు కనక్షన్‌ ఉందా…?

-

పుష్ప మూవి ఇండియా మొత్తం సంచలనం సృష్టించింది.. ఇప్పుడు అందరూ పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు.. ఈ మధ్యే.. సినిమాకు సంబంధించి బన్నీ లుక్‌, గ్లిప్స్‌ కూడా రిలీజ్‌ అయ్యాయి.. ఆ లుక్‌లో బన్నీ ఎలా ఉన్నాడో మీరు చూసే ఉంటారు.. ఆ లుక్‌ వెనుక పెద్ద కథే ఉంది మీకు తెలుసా..? తిరుపతిలో గంగమ్మ జాతర గురించి మీకు తెలుసా.. ఈ గంగమ్మ జాతరకు ఆ లుక్‌కు సంబంధం ఉంది.. ఇంతకీ ఆ జాతర వెనుక ఉన్న కథేంటో చూద్దామా..!

తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమ ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానాలను ప్రతిబింబిస్తుంది. శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంలో అమ్మవారిని దర్శించుకోవడం దీని ప్రత్యేకత. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. ప్రతి వేషంలోనూ ఎంతో ప్రత్యేకత, ఎంతో ఆధ్యాత్మిక అంతర్యం దాగివుంది. పాలేగాడిని గుర్తించడానికి అమ్మవారు ఆయా రోజుల్లో వేసే వేషాలను భక్తులు అనుసరించడం దీంతో అమ్మవారు సంతృప్తి చెంది వారి కోరికలు తీర్చుతుందన్నది ప్రగాఢ విశ్వాసం

జాతరలో రెండో రోజు బైరాగి వేషం వేసి ఒంటిపై నాముకొమ్ము పూసుకుని, వేపమండలు చేతబట్టి ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారట.. మూడోరోజు బండ వేషం, నాలుగో రోజు తోటి వేషం వేసుకుంటారు. తోటి వేషంలో భాగంగా ఒంటిపై మసి బొగ్గు పూసుకుని, తెల్లని నామం, కనుబొమ్మలపైన చుక్కలు పెట్టుకోవడం సంప్రదాయం. చిన్నపిల్లలు మీసాలను ధరిస్తారు. తలపై వేపాకు మండలు, పాతపొరక చేతబట్టి వీధుల్లో సంచరిస్తూ వేషాలమ్మ తల్లి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుంటారు. ఐదో రోజు నగరంలోని కైకాల కులస్థులు వంశపారంపర్యంగా దొరవేషాన్ని ధరిస్తారు. ఆరో రోజున ధరించే మాతంగి వేషాలు అత్యంత ప్రధానమైనమి. పురుషులు సైతం మహిళల్లా అలంకరించుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

ప్రతీ ఏటా మే నెలలో గంగమ్మ తల్లి జాతరను చేస్తారు. దీనిని తాతగట్టు గంగమ్మ జాతర అని కూడా పిలుస్తారు. మే నెల మెుదటి మంగళవారం ప్రారంభమై.. రెండో మంగళవారం జాతర ముగుస్తుంది. మెుదటి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమంతో జాతర మెుదలవుతుంది.

జాతర చాటింపు జరిగిన తర్వాత.. పొలిమేర దాటొద్దని నియమం. తిరుపతి నగరంలో కొలువు తీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అంకాళమ్మ, మాతమ్మ, ఉప్పంగి మారెమ్మ, తాళ్ళపాక పెద గంగమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, గంగమ్మలకు జాతర కైంకర్యాలు, జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. గంగమ్మను వేంకటేశ్వరుడి చెల్లెలిగా భావిస్తారు. అంతేకాదు.. టీటీడీ వారు అమ్మవారికి పట్టు చీర సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు.

తిరుపతి పొలిమేరల్లో ఏడుగురు గ్రామ దేవతలు ఉండగా.. వారిలో గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఆ తల్లికి భక్తులు పసుపు, కుంకుమ, చీరెలు, పొంగళ్ళు సమర్పిస్తారు. చినగంగమ్మ పెళ్లికానీ యువతి. అప్పట్లో తిరుపతిలో పాలెగాడు.. గంగమ్మను చూసి మోహించి బలవంతం చేయబోతాడట. అప్పుడు గంగమ్మ ఉగ్రరూపంతో పాలెగాడిని సంహరించబోతుంది. పాలెగాడు భయపడి పాయిపోయి దాక్కుంటాడట..అయితే పాలెగాడిని సంహరించేందుకు.. వివిధ వేషాల్లో(బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి) వెతుకుతుంది. చివరిరోజున దొర వేషంలో వెళ్తుంది. తమ దొర వచ్చాడని పాలెగాడు బయటకు వస్తాడట. అప్పుడు గంగమ్మ విశ్వరూపంతో పాలెగాడిని సంహరిస్తుంది. మరుసటి రోజున మాతంగి వేషంతో పాలెగాడి భార్యను ఓదారుస్తుంది. దుష్టుడైన పాలెగాడిని సంహరించిన గంగమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా భావించి జాతర చేస్తారు.

తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు చాలా మంది భక్తులు వస్తారు. ఈ జాతర ఏడురోజులు జరుగుతుంది. అందులో పురుషులు ఓ రోజున స్త్రీలాగా రెడీ అవుతారు. ఇప్పుడు అల్లూఅర్జున్‌ లుక్‌ కూడా ఆ వేషాల్లో ఒకటిగా తెలుస్తుంది.. కథను బట్టి చూస్తుంటే.. మూవీలో దీనికి సంబంధించి ఏదైనా లైన్‌ ఉండొచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news