పరువునష్టం కేసులో మరోసారి రాహుల్‌ గాంధీకి నిరాశ

-

పరువునష్టం దావాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి మరోసారి నిరాశ ఎదురైంది. మోదీ అనే ఇంటి పేరున్నవారి విషయంలో చేసిన వ్యాఖ్యకు గానూ సూరత్‌లోని న్యాయస్థానం విధించిన రెండేళ్ల శిక్షపై స్టే ఇవ్వడానికి సెషన్స్‌ కోర్టు ఇదివరకే నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై గుజరాత్‌ హైకోర్టులోనూ రాహుల్ కు చుక్కెదురైంది.

రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం రోజున విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలు ముగిసినందువల్ల అత్యవసరంగా మధ్యంతర ఉత్తర్వులు గానీ, తుదితీర్పు గానీ వెలువరించాలని రాహుల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వి అభ్యర్థించారు. పరువునష్టం కేసులో మూడు నుంచి ఆరు నెలలకు మించి శిక్ష విధించిన సందర్భాలు లేవని, తన క్లయింట్‌ది తొలి అపరాధమైనా గరిష్ఠ శిక్ష వేశారని చెప్పారు.

ఆయన వాదనలతో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ తరఫు న్యాయవాది నిరుపమ్‌ నానావతి విభేదించారు. అనర్హతకు గురైన ఎంపీ క్షమాపణలు చెప్పకపోతే శిక్షపై స్టే కోసం హైకోర్టును ఆశ్రయించడం కూడా తగదని అన్నారు. ప్రస్తుత దశలో మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టంచేశారు. రికార్డులు సహా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఆదేశాలు ఇస్తానని చెబుతూ వేసవి సెలవుల అనంతరానికి కేసును వాయిదా వేశారు. ఈ నెల 8 నుంచి జూన్‌ 3 వరకు గుజరాత్‌ హైకోర్టుకు సెలవులు.

Read more RELATED
Recommended to you

Latest news