ఇటీవల భక్తుల తాకిడితో కిటకిటలాడిన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 84,539 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 39,812 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
ఇదిలా ఉంటే.. సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శుక్ర, శనివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దు చేసినట్టు తెలిపారు. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తారని, దీంతో 30 నిమిషాల సమయం ఆదా అవుతుందన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. దీంతో ప్రతి రోజూ 3గంటల సమయం ఆదా అవుతుందన్నారు. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాదిమంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామి వారి దర్శనం లభిస్తుందన్నారు. తితిదే నిర్ణయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని తితిదే ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.