తెలంగాణ బీజేపీలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకునేలా ఉంది..ఆ పార్టీలో కీలక మార్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఎలాంటి మార్పులు లేకుండానే ఎన్నికలకు వెళ్లిపోతామని నాయకులు చెబుతున్నారు. కానీ పరిస్తితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. మొన్నటివరకు అంటే రాష్ట్రంలో బిజేపి దూకుడుగా రాజకీయాలు చేసింది. బిఆర్‌ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేసింది. బిఆర్‌ఎస్ సైతం..బిజేపినే ప్రధాన ప్రత్యర్ధి అన్నట్లు రాజకీయం నడిపింది.
దీంతో బిఆర్‌ఎస్, బిజేపిల మధ్యే అసలు యుద్ధం జరుగుతుందా? అనే పరిస్తితి వచ్చింది. కానీ కర్నాటక ఎన్నికలు ఒక్కసారిగా సీన్ మార్చాయి. కర్నాటకలో బిజేపి ఘోరంగా ఓడిపోవడం..కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడంతో..తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఇటు కాంగ్రెస్ సీనియర్లు అంతా కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. అటు కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. దీంతో బిజేపి రేసులో వెనుకబడింది. ఆ పార్టీలోకి వలసలు కూడా ఆగిపోయాయి. ఇతర నేతలు కూడా బిజేపి వైపు చూడటం లేదు.
ఈ క్రమంలోనే బిజేపిలో కనబడని అంతర్గత పోరు నడుస్తుంది. ఇలాంటి పరిణామాల మధ్యలో అమిత్ షా పర్యటన జరగనుంది. ఈ నెల 15న అమిత్ షా ఖమ్మం పర్యటనకు వస్తున్నారు. అయితే షా పర్యటనలోనే బిజేపిలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష్డు బండి సంజయ్‌కు యాంటీగా కొందరు నేతలు బిజేపి అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారట.. అలాగే ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. అయితే బిజేపి అధిష్టానం అధ్యక్ష పదవి మార్చడానికే చూస్తున్నట్లు సమాచారం. కాకపోతే ఈటలకు కాకుండా డీకే అరుణకు అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇటు బండిని కేంద్ర పదవిలోకి తీసుకుని, ఈటలని ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. మొత్తానికైతే ఎన్నికల ముందే తెలంగాణ బిజేపిలో ఊహించని మార్పులు చోటు చేసుకునేలా ఉన్నాయి.