ఏపీ అగ్నిగుండంగా మారింది. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండుతున్నాయి. గురువారం ఉష్టోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. 210 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలోని 31 శాతం మండలాలు నిప్పుల గుండంగా మారాయి. మరో 220 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగానే ఉంది. మొత్తంగా 64 శాతంపైగా మండలాల్లోని ప్రజలు ఉష్ణతాపానికి అల్లాడారు. నర్సాపురంలో సాధారణం కంటే అధికంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. శుక్ర, శనివారాల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 268 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. మరో 235 మండలాల్లో వడగాల్పుల ప్రభావంగా ఉంటుందని తెలిపింది.
శుక్రవారం కాకినాడ జిల్లా సామర్లకోటలో 46.8 డిగ్రీలు, విజయనగరం జిల్లా కంతకపల్లె, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 46.3 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో 46.1 డిగ్రీలు, మన్యం జిల్లా కురుపాం, అప్పయ్యపేటలో 45.6 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 45.3 డిగ్రీలు, కోనసీమ జిల్లా మండపేట,ఈతకోటలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 370 మండలాల్లో తీవ్రవడగాల్పులు,132 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.