టిడిపి అధినేత నారా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. వంగవీటి రంగా చనిపోయి 30 ఏళ్లు దాటినా ఆయన ఇప్పటికీ అందరి గుండెల్లో ఉన్నారని అన్నారు. రంగాను ఎవరు చంపించారో..? ఎవరు చంపారో..? అందరికీ తెలుసని అన్నారు. ప్రజలు అన్ని విషయాలు మరిచిపోతారనే ఆలోచనలో టిడిపి నేతలు ఉన్నారని దుయ్యబట్టారు.
రంగా విధానాలను ముందుకు తీసుకు వెళుతున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని.. కాపులకు అండగా నిలిచిన వ్యక్తి జగన్ అని అన్నారు. అందరిలోనూ ధైర్యం నింపగల శక్తివంతుడు రంగా అని కొనియాడారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎదిరించి ప్రశ్నించిన మొనగాడు రంగా అని.. రంగా హత్యకు టిడిపి ప్రభుత్వం, చంద్రబాబే కారణమని ఆరోపించారు. రంగా పేరును చిరకాలం ప్రజలు స్మరించుకునేలా తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.