పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. లీటరుకు రూ. 110 మేర చెల్లించుకోవాల్సిందే. ఇక డీజిల్ రేటు కూడా అదే స్థాయిలో ఉంది. లీటరు డీజిల్ కొనాలంటే రూ. 100 నోటు ఇవ్వాల్సిందే. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తాజాగా పెట్రోల్ డీజిల్ ధరల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్న ఈయన పెట్రోల్ ధరలపై సంచనల వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే పెట్రోల్ లీటరుకు రూ. 15కే లభిస్తుందని తెలిపారు.
దేశంలో రవాణా అవసరాలకు సగటు 60 శాతం ఇథనాల్ 40 శాతం విద్యుత్ వినియోగిస్తే పెట్రోలు లీటరు ధర రూ.15కు చేరుకుంటుందని, అంతిమంగా ఇది సామాన్యులకు లాభిస్తుందని చెప్పారు. రాజస్థాన్‌లో ప్రతాప్‌ఘడ్ నగరంలో మంగళవారం జరిగిన ఓ సభలో మంత్రి ప్రసంగించారు. తమ ప్రభుత్వ విధానాల గురించి పలు కీలక వివరాలు వెల్లడించారు.
‘‘రైతులు కేవలం అన్నదాతలే కాదు, శక్తిదాతలు కూడా కాగలరని మా ప్రభుత్వం నమ్ముతోంది. త్వరలో దేశంలోని వాహనాలు 60 శాతం ఇథనాల్ కలిగిన ఇంధనతో పరుగులు పెడతాయి. మరో 40 శాతం రవాణా ఖర్చుకు విద్యుత్ కూడా జతచేస్తే దేశంలో పెట్రోల్ సగటున లీటరు రూ.15కే లభిస్తుంది. ఇది సామాన్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.