తెలంగాణలో బీజేపీకి షాకులు తగలడం ఆగేలా లేవు. ఆ పార్టీని కొందరు కీలక నేతలు వీడేలా ఉన్నారు. ఇప్పటికే బిజేపి రేసులో వెనుకబడి ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం అనేది అసాధ్యం…అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక సింగిల్ డిజిట్ సీట్లు దాటుతుందా? లేదా? అనేది కూడా తెలియడం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ బలపడుతుంది. ఇక బిఆర్‌ఎస్ అంటే వ్యతిరేకతతో ఉన్న బిజేపి నేతలు..కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు చూస్తున్నారు.
ఎందుకంటే ఇటీవల దూకుడుగా ఉండే బండి సంజయ్‌ని అధ్యక్షుడు పదవి నుంచి తప్పించడం..ఆయన స్థానంలో మెతకగా ఉండే కిషన్ రెడ్డిని పెట్టడంతో…బిఆర్‌ఎస్ కు అనుకూలంగా బిజేపి వెళుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇక రెండు పార్టీలు ఒక్కటే అని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. పైగా జనం కూడా అలాగే భావిస్తున్నారు. బిఆర్‌ఎస్, బిజేపి ఒక్కటే అని అనుకుంటున్నారు. దీని వల్ల బిజేపికే భారీ నష్టం జరిగేలా ఉంది. అందుకే ఆ అంశం నచ్చని బిజేపి నేతలు…కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
పైగా గతంలో కాంగ్రెస్ లో పనిచేసి..తర్వాత బిజేపిలోకి వచ్చిన నేతలు..ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ వివేక్, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, డికే అరుణ లాంటి వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం వస్తుంది. ఇటు మాజీ మంత్రి చంద్రశేఖర్ అయితే కాంగ్రెస్ లోకి వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యారట.
దీంతో జంపింగుకు రెడీగా ఉన్న నేతలతో ఈటల వరుసగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారట. వారిని బుజ్జగిస్తూ బిజేపిలోనే ఉంచేలా మాట్లాడుతున్నారట. భవిష్యత్ లో మంచి పదవులు వస్తాయని అంటున్నారట. అయినా సరే బిజేపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని..కీలక నేతలు కాంగ్రెస్ లోకే జంప్ అవ్వడానికి చూస్తున్నారట. మొత్తానికి ఈటల బుజ్జగించిన నేతలు ఆగేలా లేరు.