నెల్లూరు ఎంపీ రేసులో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

-

  • అప్పుడే లీక్‌ చేసిన రాజ్యసభ సభ్యులు

ఈ సారి నెల్లూరు పార్లమెంట్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు రాజ్యసభసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం కమ్మపాళెంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేదికగా ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని, నెల్లూరు ఎంపీగా తనను ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విన్నవించారు. ఎంపీ వేమిరెడ్డి చేసిన ప్రకటన నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ఇంతవరకు క్లారిటీ రాలేదు. అయితే వేమిరెడ్డి తాను పోటీ చేయడంపై ఇంత త్వరగా ప్రకటన చేయడం వెనుక మతలబు ఏంటని చర్చించుకుంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికల జోలికి రానని చెప్పిన వేమిరెడ్డి ఇప్పుడు డైరెక్ట్‌గా పార్లమెంట్‌ బరిలో దిగుబోతున్నానని ప్రకటించడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

2018 ఏప్రిల్‌ 3న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు.మిస్టర్‌ కూల్‌గా పేరున్న వేమిరెడ్డి సైలెంట్‌గా తనదైన స్టైల్‌లో రాజకీయాలు చేస్తుంటారు.2019లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు,కడప జిల్లాల నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధులకు తానే ఆర్థికంగా తోడ్పడినట్లు సమాచారం. ఇటీవల నెల్లూరు నగరం నుంచి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబడతారనే టాక్‌ నడిచింది.

అది ఎలా ఉన్నాప్రభాకర్‌రెడ్డి మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నఅనంతరం వేమిరెడ్డి ఆశించినంతగా క్రియాశీలకంగా కనిపించిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఎక్కడా కనిపించలేదు.ఈ నేపథ్యంలో ఓ టైమ్‌లో వేమిరెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. మళ్ళీ రాజ్యసభకే వేమిరెడ్డి వెళతారు అనుకుంటున్న తరుణంలో తాజాగా ఆయన చేసిన హాట్‌ కామెంట్స్‌ చర్చకు తావిచ్చాయి.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్లమెంట్‌ బరిలో నిలబడితే ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి పరిస్థితి ఏంటని చర్చ నడుస్తోంది. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నుంచి బయటికి వచ్చాక ఆదాల ప్రభాకర్‌రెడ్డిని తీసుకువచ్చి అక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించారు. వైసీపీ వచ్చాక మూడేళ్ల వరకు ఎక్కడా కనిపించని ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకున్నాక కాస్త యాక్టివ్‌గా మారారు.

పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు,శంకుస్తాపనలు చేస్తూ ప్రతిరోజూ ప్రజల మధ్యన తిరుగుతున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్‌లు,ద్వితీయ శ్రేణి నాయకులు శ్రీధర్‌రెడ్డి వెంట తరలిపోకుండా అందరికి భరోసా ఇచ్చి కాపాడుకుంటూ వస్తున్నారు.అంతేకాదు పక్క పార్టీలో కీలకంగా ఉన్న నాయకులను కూడా వైసీపీలోకి తీసుకురావడంతో ఆదాల విజయవంతమయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్‌ టిక్కెట్‌ ఆదాల ప్రభాకర్‌రెడ్డిదేనని అంతా అనుకుంటున్నారు. ఎన్నికలు సమీపించేలోపు ఇంకెన్ని మార్పులు వస్తాయోనని నెల్లూరు ప్రజలు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news