తెలంగాణలో పేదలను ఆదుకునేందుకు.. అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంగళవారం రోజున ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. బీసీ బంధు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ వచ్చాక రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలు చేశామని కేటీఆర్ తెలిపారు. త్వరలో మళ్లీ పెంచుతామని ప్రకటించారు. ఇటీవల శాసనసభలో పింఛన్ మార్పిడి విషయం చర్చకు వచ్చిందని.. ఒక కుటుంబంలో ఆసరా పింఛనుదారు ఎవరైనా చనిపోతే అదే కుటుంబంలో అర్హులైన మరొకరికి వెంటనే మార్పిడి చేయాలని ముఖ్యమంత్రిని కోరామని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే అమలులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. బీసీల్లో 14 రకాల చేతి, కులవృత్తులపై ఆధారపడి జీవించేవారి కోసం బీసీబంధు తీసుకొచ్చామని.. లబ్ధిదారులకు ఇచ్చేది రుణం కాదని, గ్రాంటు అని, తిరిగి కట్టాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.