టీడీపీ నేత చంద్రబాబుపై తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు పతివ్రత కబుర్లు చెబుతున్నారు. రోజు రోజుకు వాళ్ల అరుపులు కేకలు ఎక్కువయ్యాయి. వీళ్ల అసలు స్వభావం ఏంటి ? వీళ్లు చేస్తున్న హడావిడి దేని కోసం అని ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం. ఓట్ల తొలగింపు పై టీడీపీ రాద్దాంతం చేస్తుందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డదార్లు తొక్కడం, గోడలు దూకడం టీడీపీకి అలవాటు అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ తీరు దొంగే దొంగ అని అరిచినట్టుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తెలిసిందన్నారు సజ్జల. చంద్రబాబు విద్యలు అందరికీ తెలుసు. తప్పు తాను చేసి అవతలవారిని అనడం చంద్రబాబుకి బాగా తెలుసు. 60లక్షల ఓట్లు ఎవరివో కూడా మాకు తెలియదు.పక్కాగా తొలగిస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినట్టు తెలిపారు. టక్కుమార విద్యలో చంద్రబాబు పీహెచ్డీ చేశాడు. కుప్పంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో అందరికీ తెలిసిందే. దాదాపు 30వేల నుంచి 40 వేల వరకు ఓట్లు బయటపడ్డాయి. దొంగ ఓట్ల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి వెల్లడిస్తామని చెప్పారు సజ్జల.