గత రెండు రోజులుగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఒక్కో అడుగు మేర ఎత్తి 3250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు, ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు.
బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిసరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.