ఆధార్‌ అప్డేట్‌ పేరుతో కొత్తరకం మోసానికి తెరలేపిన సైబర్‌ నేరగాళ్లు..

-

సైబర్‌ మోసగాళ్లు మనల్ని బురిడి కొట్టించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇలా కూడా మోస చేస్తారా అనేలా వాళ్లు తెలివిమీరారు. ఇప్పుడు అందరూ ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకుంటున్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం కంపల్సెరీ అయినప్పటి నుంచి చాలా మంది ఆధార్‌ను అప్‌డేట్ చేసుకుంటున్నారు. ఇదే మంచి అవకాశం అనుకోని.. సైబర్‌ నేరగాళ్లు కొత్తరకం స్కాన్‌ను తెరలేపారు. ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలంటూ ఏవైనా మెసేజ్‌లు లేదా ఈమెయిల్స్ వస్తే వాటికి స్పందించకూడదని, ఎలాంటి వివరాలను షేర్ చేయకూడదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రజలను హెచ్చరించింది.

10 ఏళ్ల క్రితం ఆధార్ కార్డ్‌లను పొందిన వారు వారి తాజా వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని UIDAI ఇటీవల కోరింది. ఇదే సమయంలో స్కామర్లు ఆధార్ కార్డులను సులభంగా ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చని ఈమెయిల్స్‌, వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. అప్‌డేట్ చేయాలంటే డాక్యుమెంట్స్ షేర్ చేయమని చెప్తారు.. ఇలాంటి వారికి డాక్యుమెంట్స్ షేర్ చేస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉందని UIDAI హెచ్చరించింది. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది.

 

మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (POI) లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) డాక్యుమెంట్లను ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేయమని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మిమ్మల్ని అడగదు.” అని UIDAI అఫీషియల్ X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్ క్లారిటీ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలనుకున్నవారు myAadhaarPortalకి వెళ్లి అలానే చేయొచ్చని వెల్లడించింది. సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి కూడా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చని వివరించింది.

ఈ పనులు చేయకండి..

జిరాక్స్ షేర్ చేయొద్దు : చాలామంది ప్రజలు సంస్థలతో ఆధార్ కార్డు జిరాక్స్‌లను షేర్ చేస్తుంటారు. నిజానికి వీటిలో సున్నితమైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డ్ ఫొటోకాపీ/జిరాక్స్ ఎవరితోనూ పంచుకోవద్దు. దానికి బదులుగా ఆధార్ నంబర్ చివరి 4 అంకెలను మాత్రమే కనిపించేలా ఆధార్‌ డీటెయిల్స్ బ్లర్ చేసి షేర్ చేయవచ్చు. అప్పుడు అవతలి వ్యక్తికి పేరు, చిరునామా, పుట్టిన తేదీ ఇతర వ్యక్తిగత సమాచారం కనిపించదు. దీనివల్ల మోసాల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు : ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు, కానీ దానిని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని UIDAI సూచించింది. అలా కాదని షేర్ చేస్తే డెబిట్ కార్డ్ నంబర్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసినంత ప్రమాదమేనట. బాగా నమ్మకం ఉన్న వ్యక్తులు లేదా సంస్థలతో మాత్రమే దీన్ని షేర్ చేసుకోవాలని తెలిపింది.

ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లేటెస్ట్ డీటెయిల్స్‌తో ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news