సింగిల్‌గా అయితే ఓకే… చంద్రబాబుపై నమ్మకం లేదంటున్న జనసేన నేతలు

-

చంద్రబాబు వైఖరితో విసిగిపోతున్నారు జనసేన నాయకులు.మన దారి మనం చూసుకుందాం… మోసకారి చంద్రబాబుతో మనకెందుకు అన్నట్లు దూరం పాటిస్తున్నారు. అటు అధినేత పవన్‌తో కూడా ఖరాకండీగా చెప్పేస్తున్నారు. అయినప్పటికీ కార్యకర్తల మాటలు పెడ చెవిన పెట్టిన పవన్‌ కళ్యాణ్‌…, చంద్రబాబు పంచన చేరి క్యాడర్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 2014 ఎన్నికల్లో అవసరం కోసం పవన్ కళ్యాణ్ ను వాడుకుని కరివేపాకులా వాడుకుని తీసిపడేసిన సంగతిని పార్టీ క్యాడర్ ఇంకా మర్చిపోలేదు. అయితే ప్యాకేజీలకు అలవాటు పడిన వపన్‌ చంద్రబాబు ఇంటికెళ్ళి తామంతా కలిసే ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. కార్యకర్తలు దీనిని వ్యతిరేకిస్తున్నా ఎల్లో మీడియా మాత్రం భలే ఊదరగొడుతోంది.

టీడీపీ,జనసేన కలయికలో ఏపీలో ప్రభంజనం తప్పదని కథనాలు రాసేస్తున్నారు. ఓవైపు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ సీట్ల షేరింగ్ గురించి మాట్లాడారనే చర్చ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. 50 అసెంబ్లీ సీట్లతో పాటు 5 ఎంపీ సీట్లు కావాలని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.దీనికి ఏమాత్రం తలొగ్గని చంద్రబాబు మూడు పార్లమెంట్, 30 అసెంబ్లీ ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

వారాహి యాత్ర చేపట్టిన వపన్‌ కళ్యాణ్‌ జనసేన గ్రాఫ్‌ వీర లెవల్లో పెరిగిపోయిందని పలు సందర్భాల్లో చెప్పారు. 25 నుంచి 30 శాతానికి ఓటింగ్‌ శాతం పెరిగిందని ఈ సారి జనసేనకు కనీస సీట్లు వస్తాయని చెప్పారు. వారాహి యాత్రకు వచ్చిన జనాన్ని బట్టి ఇదంతా ఊహించుకుంటున్నదే. కానీ అది వర్కవుట్‌ కాదని పవన్‌ తెలుసుకోలేక పోతున్నాడు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ సభలకు జనం బాగానే వచ్చారు. కానీ అక్కడ జనసేన పొత్తుతోనే బీజేపీ గెలవాల్సిన సీట్లు పోగొట్టుకుందనే టాక్‌ మూటగట్టుకున్నారు. ఇదే సీన్ ఏపీలో కూడా రిపీట్ అవుతుందంటున్నారు రాజీకీయ విశ్లేషకులు. ఇదంతా పసిగట్టిన చంద్రబాబు…, పవన్‌ పార్టీ ప్రాధాన్యం తగ్గిస్తూ సీట్ల షేరింగ్‌ లో కోత పెట్టారు.అటు పవన్‌ కూడా 30 సీట్లు అయితే టీడీపీతో పొత్తు వద్దని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇదంతా చూస్తే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎంతవరకు పొసుగుతుందనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది.

సింగిల్‌గా పోటీ చేసినా ఈ సారి గౌరవప్రదమైన సీట్లు వస్తాయని కొందరు పార్టీలోని నేతలు భావిస్తున్నారు. మోసం చేసిన చంద్రబాబును నమ్మేదేలేదని కాపులు తెగేసి చెప్తున్నారు. అయితే దీనిని పట్టించుకోని పవన్‌ కళ్యాణ్‌ కార్యకర్తలు,నేతల పట్ల గుర్రుగా ఉన్నారని,ఇష్టం లేకపోతే మరో పార్టీలోకి వెళ్ళొచ్చని సూచించినట్లు సమాచారం. పవన్ పై అభిమానంతో సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుని ఎన్ని అవమానాలు, అసమానతలు ఉన్నా భరించామని ఇపుడు తమ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు పార్టీలోనే సైలెంట్ గా ఉండిపోదామని పార్టీలో ఒక వర్గం డిసైడ్ అయినట్లు సమాచారం.

అందుకే టీడీపీతో పవన్ ప్రకటన తర్వాత జనసేన నాయకులు కొంతమంది యాక్టివ్ గా లేరు. ఆ తరువాత నుంచి పవన్‌ చేపడుతున్న కార్యక్రమాలకు కార్యకర్తలు పలచబడిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు పవన్‌కళ్యాణ్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేడర్‌ ఎలా కంట్రోల్‌ చేయాలో తెలియక చంద్రబాబుని సలహా అడిగినట్లు ఓ వర్గం నేతలు చెప్తున్నారు. ఒక పార్టీ అధినేతగా సొంత నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తి ఉండలేమని మరికొంత మంది తట్ట బుట్ట సర్దేశారని సమాచారం. వారందరూ ఒక్కసారిగా వైసీపీలోకి జంప్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ సారి కూడా జనసేన గెలవడం కష్టమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news