కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తల్లిదండ్రులు చనిపోయినా చివరి చూపులు దక్కని దయనీయ పరిస్థితులు ప్రస్తుతం నెలకొంటున్నాయి. ఈ పరిస్థితి సాధారణ ప్రజలకే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రులకు సైతం ఈ కష్టం తప్పడం లేదు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిషత్ (89) సోమవారం ఉదయం కన్నుమూశారు.
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఆయనకు స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో తండ్రి కడసారి చూపునకు నోచుకోలేకపోతున్నానని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వాపోయారు. దాంతో తాను తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని కుటుంబ సభ్యులకు సందేశం పంపారు.
యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిషత్ గతంలో ఉత్తరాఖండ్ అటవీ శాఖల ఫారెస్ట్ రేంజర్‌గా విధులు నిర్వర్తించారు. అయితే బిషత్ గత కొంతకాలగా కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. మార్చి 13న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన కన్నుమూశారు. దీంతో నిజాయితీ, ప్రజా సంక్షేమం కోసం కష్టపడి పనిచేసే గుణం నాకు మా నాన్న నుండే అలవడ్డాయి అని యూపీ సీఎం అన్నారు. అలాంటి ఆయనను చివరి క్షణాలలో చూడటానికి వెళ్లాలని భావించానని, కానీ కరోనా వైరస్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రణాళికల రూపకల్పనలో తీరికలేకుండా గడుపుతుండటంతో అంత్యక్రియలలో పాల్గొనలేకపోతున్నానని యోగి వ్యాఖ్యానించారు.