అందంగా కనిపించడం అంటే ముఖానికి మేకప్ రుద్దుకుని రెడీ అయిపోవడం కాదు. మీ జుట్టు మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఆల్రెడీ రెడీ అయిన తర్వాత మీ హెయిర్ స్టైల్ ని కొద్దిగా మారిస్తే చాలు మీ లుక్ పూర్తిగా మారిపోతుంది. అందుకే హెయిర్ మీద దృష్టి పెట్టాలి. దాని సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. రాలిపోవడం దగ్గర నుండీ తెల్లబడడం వరకూ నివారించాలి. ప్రస్తుతం జుట్టు తెల్లబడడానికి కారణమయ్యే కొన్ని అలవాట్లను తెలుసుకుందాం.
రసాయనాల వాడకం
అందంగా కనిపించాలన్న ఉద్దేశ్యంతో జుట్టుకి రకరకాల రసాయనాలు వాడుతుంటారు. అవన్నీ జుట్టుపై దుష్ప్రభావాలు చూపుతాయి. అందుకే యవ్వనంలో ఉండగానే జుట్టు తెల్లబడడం మొదలవుతుంది. ముఖ్యంగా జుట్టును స్ట్రెయిట్ చేయాలన్న ఉద్దేశ్యంతో వేడిని వెదజల్లే సాధనాలను వాడవద్దు.
వాటివల్ల జుట్టు విఛ్ఛిన్నం అయిపోయి కుదుళ్ళ వద్ద బలహీనంగా మారతాయి. తద్వారా జుట్టు రాలిపోతుంది. ఇంకా, జుట్టు తెల్లబడడానికి ఇది ప్రధాన ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల మీ జుట్టును వీలైనంత సహజంగా ఉంచండి. అనవసరమైన వాటి జోలికి వెళ్ళి ఉన్న జుట్టును పోగొట్టుకోవద్దు.
ఒత్తిడి
జుట్టు తెల్లబడడానికి మరో ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడికి ఎక్కువ గురయ్యేవారు జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అందుకే వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అది మీవల్ల కాదులే అంటారా? ధ్యానం ప్రాక్టీస్ చేయండి.
జంక్ ఫుడ్
మీరు తీసుకునే ఆహారాలు మీ జుట్టు ఆరోగ్యానికి ఏ విధంగా పనిచేస్తున్నాయన్నది తెలుసుకోవాలి. జంక్ ఫుడ్ అస్సలు ముట్టుకోవద్దు. బయట దొరికే చిరుతిళ్ళు తినకపోవడమే మంచిది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా మీరు తీసుకునే ఆహారం సరైనది కాకపోతే జుట్టు తెల్లబడడం తగ్గకుండా ఉంటుంది. అందుకే ముందుగా, మీ ఆహారంలో పప్పుపు, మొలకలు, పండ్లు, పచ్చి కూరగాయలు చేర్చండి.