విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న బాలకృష్ణ

టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా పండుగ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. శరన్నవరాత్రులలో ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.

దర్శనమనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. అమ్మవారి కరుణ కటాక్షాలు భక్తులపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి జరిగి, ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని అన్నారు. మానవ శాంతి ఉంటే ప్రపంచ కళ్యాణం జరుగుతుందన్నారు. చెడు మీద మంచి, అధర్మం మీద ధర్మం గెలిచిన రోజు కాబట్టి ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తుందన్నారు. బాలయ్య కు లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు ఆలయ అధికారులు. మంగళవారం విజయవాడలో జరిగిన అన్ స్టాపబుల్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ కోసం బాలయ్య విజయవాడకు వచ్చారు.