ఆ చిత్రం చూసి ముఖ్యమంత్రి భావోద్వేగం..మీడియా ఎదుట కన్నీటి పర్యంతం!

శాండల్ వుడ్ (కన్నడ) హీరో రక్షిత్ శెట్టి, సంగీత శృంగేరి హీరో, హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘777 చార్లీ’. ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. ఈ పిక్చర్ గురించి ఇటీవల ఇంటర్వ్యూల్లో దగ్గుబాటి రానా కూడా గొప్పగా చెప్పారు. తాజాగా ఈ మూవీని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై వీక్షించారు.

 

ముఖ్యమంత్రికి ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ సందర్భంగా సినిమా గురించి ముఖ్యమంత్రి రివ్యూ ఇచ్చేశారు. మీడియా ఎదుట సినిమా గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. చిత్రం చాలా బాగుందని, తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. మనిషికి, శునకానికి మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా వెండితెరపైన ఆవిష్కరించారని కొనియాడారు.

జంతు ప్రేమికుడు అయిన బసవరాజ్ బొమ్మై..ఈ సినిమాపైన పాజిటివ్ గా స్పందించారు. ఈ పిక్చర్ చూస్తున్న క్రమంలో గతేడాది తన ఇంట్లో చనిపోయిన పెంపుడు కుక్క గుర్తుకొచ్చిందని వివరించారు. డాగ్స్ తమ ఓనర్స్ పట్ల హద్దులు లేని ప్రేమ చూపుతాయని ముఖ్యమంత్రి వివరించారు.