హీరో నాని వర్సెస్ బొత్స : సినిమా వాళ్ళకే ‘సినిమా’ చూపిస్తున్నారుగా!

ఏపీలో సినిమా టిక్కెట్ల అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం స్వయంగా సినిమా టిక్కెట్లు అమ్మడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అలాగే సినిమా టిక్కెట్ల రేట్లని కూడా భారీగా తగ్గించింది…ఇదంతా ప్రజల మేలు కోసమే అని ప్రభుత్వం చెబుతుంది. ఉదాహరణకు రూరల్ ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో బాల్కనీ రూ.20, ఫస్ట్ క్లాస్ రూ.15, నేల రూ.10 రేట్లని ఫిక్స్ చేసింది. అయితే ఈ ధరలు ఎప్పుడో పూర్వ కాలంవి…ఈ ధరలతో సినిమాకు ఎలాంటి లాభం రాదని, టిక్కెట్ల రేట్లని పెంచాలని ఇండస్ట్రీ వారు డిమాండ్ చేస్తున్నారు.

కానీ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా లేదు..పైగా ఇప్పుడు వరుసపెట్టి థియేటర్లపై రైడ్ చేస్తుంది..నిబంధనలకు విరుద్ధంగా ఉన్న థియేటర్లని మూసి వేస్తుంది. ఇక ఈ ధరలతో సినిమా వేయలేమని చెప్పి..కొన్ని థియేటర్లని స్వచ్ఛందంగా మూసివేసే పరిస్తితి. దీంతో సినిమా వాళ్ళు పరిస్తితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే హీరో నాని…టిక్కెట్ల అంశంపై స్పందించారు…సినిమా కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టులో కలెక్షన్ ఎక్కువ వస్తుందని, ఇలా రేట్లు తగ్గించడం ప్రేక్షకుడుని అవమానించినట్లే అని నాని అన్నారు.

ఆ వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలని, అందుకే ధరలు తగ్గించామని, మార్కెట్‌లో ఏదైనా ఉంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా? అని ప్రశ్నించిన బొత్స ప్రేక్షకులను తాము ఎందుకు అవమానిస్తామని నానికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వం విధానంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

సరే సామాన్యులకు అందుబాటులో ఉండాలని సినిమా టిక్కెట్లు ధరలు తగ్గించారు…మరి ఇసుక, సిమెంట్, కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్, నిత్యవసరాల ధరలు కూడా తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావచ్చు కదా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా జగన్ ప్రభుత్వం సినిమా వాళ్ళకే సినిమా చూపిస్తున్నట్లు ఉంది.