తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్‌కు అశేషమైన అభిమానులు ఉన్నారు. ఆయన నటిస్తున్న సినిమా అప్ డేట్ గురించి తెలుసుకోవాలని వారు ఎప్పుడూ వెయిట్ చేస్తుంటారు.
రజనీకాంత్ సినీ ప్రేక్షకులకు చివరగా ‘అన్నాత్తె’ చిత్రంలో కనిపించారు. తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. రజనీకాంత్ తన 169వ చిత్రాన్ని ‘కొలమావు కోకిల, డాక్టర్, బీస్ట్’ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తో చేస్తున్నారు. ‘బీస్ట్’ ఫిల్మ్ అనుకున్న స్థాయి అంచనాలను అందుకోలేదని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ చేయడం లేదని వార్తలు రాగా, వాటిని కొట్టి పారేశారు రజనీ.
సన్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ పిక్చర్ లో ఓ కీ రోల్ కోసం యంగ్ హీరో శివకార్తీకేయన్ ను సెలక్ట్ చేసినట్లు టాక్. నెల్సన్-శివకార్తీకేయన్ కాంబోలో వచ్చిన ‘డాక్టర్’ పిక్చర్ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది.
ఈ నేపథ్యంతో పాటు రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకోకూడదని అనుకున్నాడట. ఒకప్పుడు రజనీ వాయిస్ ను ఇమిటేట్ చేసిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శివకార్తీకేయన్ త్వరలో రజనీకాంత్ తో ఆన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతారని సమాచారం. ఈ విషయమై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.. చూడాలి మరి ఏమవుతుందో..