Mahesh Babu Birthday Special. ఈ విషయాలు ఎప్పుడైనా తెలుసుకున్నారా?

-

ఇటీవలే సర్కారు వారి పాటతో సూపర్​ హిట్​ అందుకున్న సూపర్​స్టార్​ మహేశ్​బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్​మీడియా ద్వారా విషెస్​ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..

అందం వెనక రహస్యం..

మహేశ్‌ బాబు అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అందం. ‘మహేశ్‌కు వయసు పెరిగినా అందం తరగదు’ అని చాలామంది అంటుంటారు. ‘మీ అందం వెనక రహస్యం ఏంటి’ అని కొందరు మహేశ్‌ను ఇంటర్వ్యూల్లో ప్రశ్నిస్తుంటారు. తన కుమారుడు గౌతమ్‌ సోదరుడిలా కనిపించే 47 ఏళ్ల మహేశ్‌ను చూస్తే ఆ సందేహం కలగడం సహజమే. “చిరు నవ్వే నిజమైన అందం. ఆ నవ్వు మనస్ఫూర్తిగా రావాలి. అందుకు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. నేనింత ప్రశాంతంగా ఉండటానికి కారణం.. నేనే తప్పూ చేయకపోవటం, భవిష్యత్తులోనూ చెయ్యను అని నా మీద నాకున్న నమ్మకం. ఇది నాన్న నుంచి నేర్చుకున్నా” అని అంటుంటారు మహేశ్‌.

పేద చిన్నారులకు సాయం

కుటుంబానికే మహేశ్‌ బాబు అధిక ప్రాధాన్యతనిస్తారు. ‘ఇంట్లో ఆనందంగా ఉంటేనే బయటా ఆనందంగా ఉంటాం. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని’ అని అంటుంటారాయన. మహేశ్‌కి తన పిల్లలైనా, బయటి వారైనా ఎంతో ఇష్టం. ఆ మంచి మనసే ఎన్నో చిట్టి ‘గుండె’లకు ఊపిరిలూదింది. మహేశ్‌ తనయుడు గౌతమ్‌.. డెలివరీ డేటు కంటే ఆరువారాలు ముందే పుట్టాడంతో మహేశ్‌ సంబంధిత చికిత్స చేయించారు. దాదాపు మూడు నెలలకి గౌతమ్‌ మామూలయ్యాడు. వారి జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఎంతోమంది చిన్నారుల జీవితాలను కాపాడింది. “మన దగ్గర డబ్బుంది కాబట్టి సరిపోయింది. ఎంతైనా ఖర్చుపెట్టి పిల్లాడిని రక్షించుకున్నాం. అదే లేనివాళ్లకి ఇలా జరిగితే వారి పరిస్థితి ఏంటీ..’ అని మహేశ్‌ బాధపడేవారు” అంటూ మహేశ్‌ సతీమణి నమ్రతా తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు గురించి ఓ సందర్భంలో చెప్పారు. పుట్టుకతో వచ్చే ఆ సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. అలా.. విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌ ద్వారా మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ సుమారు 1300ల మందికిపైగా చిన్నారులకు వైద్యం సాయం అందించారు. తెలంగాణలో ఉండేవారికీ ఇబ్బంది లేకుండా ‘ప్యూర్‌ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌’ పేరిట హైదరాబాద్‌లోనూ గుండె ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టారు.

పుస్తకం చదివి.. సిగరెట్‌ మానేసి!

నటుల్లో శ్రీదేవి అంటే మహేశ్‌కు బాగా ఇష్టం. ప్రదేశాల్లో.. గోవా, న్యూజిలాండ్‌. పార్టీలు, ఫంక్షన్‌లకు వెళ్లడమంటే ఇబ్బందిగా ఫీలవుతారాయన. మహేశ్‌ పుస్తక పఠనాన్ని ఆస్వాదిస్తారు. ఎంతగా అంటే వాటి నుంచి స్ఫూర్తిపొంది తనని తాను మార్చుకునేంత. ఒకప్పుడు తనకు సిగరెట్‌ తాగే అలవాటు ఉండేదని, ఎంత ప్రయత్నించినా మానలేకపోయానని, ఎలెన్‌ కార్‌ రాసిన ‘ది ఈజీ వే టు స్టాప్‌ స్మోకింగ్‌’ అనే పుసక్తం చదివాక సిగరెట్‌ని తాకలేదని మహేశ్‌ ఓ సందర్భంలో తెలిపారు. తాను ఏ పుస్తకం చదివినా వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకుని, పుస్తకాల వివరాల్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. ట్విటర్‌లో మహేశ్‌ను అనుసరిస్తున్న వారి సంఖ్య: 12.7 మిలియన్‌కిపైగా. ఇన్‌స్టాగ్రామ్‌: 8.7 మిలియన్‌కిపైగా. ఇంతమంది అభిమాన గణాన్ని సంపాదించుకున్న మహేశ్‌ తనకు తెలియకుండా ‘కెమెరా’ ముందుకొచ్చారు.

జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. మహేశ్‌బాబు సినీ రంగ ప్రవేశం కూడా అంతే. ఓ సారి తన అన్నయ్య రమేశ్‌తో కలిసి మహేశ్‌ విజయవాడ వెళ్లారు. రమేశ్‌ ‘నీడ’ అనే సినిమాలో నటిస్తున్న రోజులవి. దాసరి నారాయణ రావు ఆ చిత్రానికి దర్శకుడు. ఓ కీలక పాత్రని మహేశ్‌కి తెలియకుండానే ఆయనపై చిత్రీకరించారు దాసరి. అలా బాల నటుడిగా మహేశ్‌ తెరంగేట్రం చేసిన ఇదే. అప్పుడు మహేశ్‌ వయసు సుమారు 6 ఏళ్లు.
ఊహ తెలిశాక మహేశ్‌ నటించిన తొలి చిత్రం ‘పోరాటం’. కృష్ణ హీరోగా దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన సినిమా ఇది. ‘డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో’ అని అభిమానులంతా పిలుచుకునే కృష్ణ సాహసాల్ని రెండు సినిమాల అనుభవంతోనే ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేశారు మహేశ్‌. ‘శంఖారావం’ సినిమా చిత్రీకరణ సమయమది… మహేశ్‌ ధరించిన క్యాస్ట్యూమ్స్‌లాంటివే వేసుకుని మరో కుర్రాడు అక్కడి రాగా, అతణ్ణి చూసి మహేశ్‌లో ఆలోచన మొదలైంది. ఉండబట్టుకోలేక ‘ఇతనేంటి నాలానే రెడీ అయి వచ్చాడు’ అని టీమ్‌ని మహేశ్‌ అడిగేశాడట. ‘అతడు నీకు డూప్‌.. రిస్కీ షాట్లు చేయాల్సి వచ్చినప్పుడు అతడే చేస్తాడు’ అనే సమాధానం విన్న మహేశ్‌ అది కరెక్ట్‌ కాదని భావించాడు. ‘నా స్థానంలో ఎవరో నటిస్తే, దాన్ని చూసి ప్రేక్షకులు చప్పట్లు కొడితే ఏం బాగుంటుంది’ అనే అభిప్రాయంతో సాహసోపేతమైన సన్నివేశాల్లోనూ ఆయనే నటించాడు. ఆ తర్వాత తెరకెక్కిన ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలోనూ మహేశ్‌ డూప్‌ లేకుండా నటించాడు.
‘బజార్‌ రౌడీ’, ‘ముగ్గురు కొడుకులు’, ‘గూఢచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’.. తనకు హాలీడేస్‌ ఉన్న రోజుల్లో ఈ సినిమా షూటింగ్స్‌లో మహేశ్‌ పాల్గొనేవాడు. వేసవిలో చిత్రీకరణ జరుపుకోవాల్సిన ‘అన్నా తమ్ముడు’ అనివార్య కారణంగా వాయిదా పడింది. దాంతో మహేశ్‌ స్కూల్‌ వెళ్లలేకపోయాడు. సినిమాల వల్ల కొడుకు చదువు ఎక్కడ పాడైపోతుందోనన్న సందేహంతో ‘ఇకపై సినిమాలు వద్దు.. బుద్ధిగా చదువుకో’ అని కృష్ణ.. మహేశ్‌కి చెప్పారట.

 

కట్‌ చేస్తే.. మహేశ్‌ ఫోకస్‌ అంతా స్టడీస్‌పైనే పెట్టాడు. గణితం మినహా మిలిగిన సబ్జెక్టులన్నీ ఆయనకు ఇష్టమట. పదో తరగతిలో అనుకునన్ని మార్కులు రాకపోవటం వల్ల తనకెంతగానో ఇష్టమైన లయోలా కాలేజీలో (ఇంటర్) సీటు పొందలేకపోయాడు. ఇంటర్‌లో కష్టపడి చదివి, మంచి మార్కులు సాధించి లయోలా కాలేజీలో డిగ్రీలో (బీకామ్‌) సీటు పొందాడు. ఆ సమయంలోనే మళ్లీ సినిమాలు, నటనపై మహేశ్‌కు ఆసక్తి మొదలైంది. తనకున్న ఆసక్తిని తండ్రితో పంచుకున్నాడు. కృష్ణ ఓకే అన్నారు. అలా.. దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్‌ మహేశ్‌ బాబును హీరోను చేశారు. ఈ ముగ్గురు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘రాజకుమారుడు’.

 

హీరోగా తొలి సినిమాతోనే మహేశ్‌ మంచి విజయం అందుకున్నారు. తొలి సినిమా కాబట్టి ‘రాజకుమారుడు’ విషయంలో తన తండ్రి కృష్ణ జోక్యం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచీ మహేశ్‌ తన సినిమా కథలకి తానే నిర్ణయం తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఇటీవల విడుదలైన ‘సర్కారు వారి పాట’ వరకూ మహేశ్‌ సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇండస్ట్రీ హిట్‌లతో తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన సినిమాలూ ఉన్నాయి.

 

ఇలా మహేశ్‌ చూడని విజయం లేదు.. పరాజయమూ లేదు. ఏదేమైనా మహేశ్‌కు ఉన్న ఫాలోయింగ్‌లో మార్పు ఉండదు. ‘ఏదైనా సినిమా ఫ్లాప్‌ అయిందంటే నేను తట్టుకోలేను. ఎవరితోనూ మాట్లాడను. అయితే, అది తాత్కాలికమే. జీవితమన్నాక అంతా తీపే కాదు చేదు అనుభవాలూ ఉంటాయి. అనుభవం మనిషికి పాఠాలు నేర్పిస్తుంది” అని మహేశ్‌ అంటుంటారు. మహేశ్ హీరోగా అగ్ర దర్శకుడు రాజమౌళి ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. మహేశ్‌ అభిమానులు, భారతీయ సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మహేశ్‌. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. టైటిల్‌ ఖరారు కాలేదు. #SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక.

 

తనకు సెట్‌ కాదు అనుకున్న సినిమా కథల్ని మహేశ్‌ తిరస్కరిస్తుంటారు. అవి మరో హీరోతో తెరకెక్కి, ఘన విజయం అందుకున్న సందర్భాలున్నాయి. మహేశ్‌తో సినిమా చేద్దామని కథ సిద్ధం చేసుకున్న దర్శకనిర్మాతలు అనివార్య కారణంగా ఆయా స్టోరీలను ఇతర నటులతో పట్టాలెక్కించిన పరిస్థితులూ ఉన్నాయి. ఈ వరుసలో ‘నువ్వు లేక నేను లేను’, ‘ఫిదా’, ‘గజిని’, ‘స్నేహితుడు'(3ఇడియట్స్‌ రీమేక్‌) ‘ఏమాయ చేశావే’, ‘పుష్ప’ తదితర చిత్రాలున్నాయనేది సినీ వర్గాల మాట.

 

ఇప్పటి వరకూ ఒక్క రీమేక్‌ చిత్రంలోనూ నటించని టాలీవుడ్‌ అగ్ర హీరోగా మహేశ్‌ నిలిచారు. బాలీవుడ్‌ దర్శక-నిర్మాతల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ‘తెలుగు’ చిత్రాల్లో మాత్రమే నటిస్తానని వాటిని మహేశ్‌ తిరస్కరించారు. మహేశ్‌కు బాగా నచ్చే దర్శకుల్లో మణిరత్నం ముందుంటారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందంటూ అప్పట్లో చర్చ సాగింది. కానీ, ఇప్పటి వరకూ రాలేదు. భవిష్యత్తులో కుదురుతుందేమో చూడాలి. నటుడిగానే కాదు నిర్మాతగానూ మహేశ్‌ విజయం అందుకున్నారు. అడివి శేష్‌ హీరోగా ఈయన తెరకెక్కించిన ‘మేజర్‌’ చిత్రం ఇటీవల విడుదలై, మంచి పేరు తీసుకొచ్చింది. మహేశ్‌ కటౌట్‌కి ఎంత క్రేజ్‌ ఉందో ఆయన వాయిస్‌కి అంతే ఉంటుంది. అందుకే ఇతర అగ్ర హీరోలు సైతం ఈయనతో తమ సినిమా కథల్ని ప్రేక్షకులకు వినిపిస్తుంటారు. పవన్‌ కల్యాణ్‌ ‘జల్సా’, ఎన్టీఆర్‌ ‘బాద్‌ షా’, కృష్ణ ‘శ్రీశ్రీ’, చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాలకు మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు.

 

మహేశ్‌ తొలిసారిగా కొన్న ఫోన్‌.. నోకియా క్లాసికల్‌ మోడల్‌ (కీ ప్యాడ్‌). తన తండ్రి కృష్ణతోనే సెల్ఫీ దిగేందుకు ఆయన ఇష్టపడతారు. వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిని గౌరవించే మేడమ్‌ టుస్సాడ్స్‌లో మహేశ్‌ బాబు మైనపు విగ్రహం చోటు దక్కించుకుంది. వ్యాపార ప్రకటనలకు మహేశ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తారనే సంగతి తెలిసిందే. పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా పనిచేసిన ఆయన ‘హీల్‌ ఏ చైల్డ్‌’ అనే స్వచ్ఛంద సంస్థకూ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. 2013లో మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌గా నిలిచిన మహేశ్‌కు అసలు కోపమే రాదట. గ్రామాల్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌తో తాను హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ని స్ఫూర్తిగా తీసుకుని తన తండ్రి కృష్ణ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. అందుకే మహేశ్‌ను ‘బాబు బంగారం’ అంతా అని కొనియాడతారు. అలాంటి మహేశ్‌బాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ‘హ్యాపీబర్త్‌డే మహేశ్‌’..!

Read more RELATED
Recommended to you

Latest news