తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా.. రాగద్వేషాలకు అతీతంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు అసహనం వ్యక్తం చేశారు. దీంతో గరికపాటి ప్రవర్తనపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గరికపాటి ప్రవచనాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి మైక్ తీసుకుని మాట్లాడానికి ప్రయత్నించిన సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి చాలా మంది మహిళలు, యువతులు స్టేజి మీదకు వచ్చారు. వేదికగా ఒక్కసారిగా జనాలు ఎక్కువ అయ్యారు. దాంతో ఒకింత హడావిడి నెలకొంది. ప్రతి ఒక్కరి దృష్టి చిరంజీవిపై ఉంది. గరికపాటి మాటలను ఎవరూ పట్టించుకునే స్థితి లేదు. దాంతో ఆయన అసహనానికి గురి అయ్యారు. చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
”ఫోటో సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండీ! లేకపోతే నేను వెళ్ళిపోతాను. నాకు ఏమీ మొహమాటం లేదు. అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారూ.. దయచేసి మీరు ఆపేసి ఇటు పక్కకి రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి.. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి” అని గరికపాటి కొంచెం గట్టిగానే మైకులో చెప్పారు. ఆయన మాటల్లో ఆగ్రహం ధ్వనించింది. దాంతో నిర్వాహకులు గరికపాటికి సర్దిచెప్పారు. ఈ క్రమంలోనే గరికపాటిపై చిరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.