గుండెపోటు వచ్చిందన్న వార్తలు నిజం కాదు – హీరో విక్రమ్ మేనేజర్

చియాన్ విక్రమ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు అంటూ వచ్చిన వార్తలతో అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో హీరో విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విక్రమ్ కు ఈ మధ్యాహ్నం చాతిలో స్వల్పంగా అసౌకర్యంగా అనిపించడం తో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు నిజం కాదని సూర్యనారాయణన్ స్పష్టం చేశారు.

ఇలాంటి పుకార్లు వినాల్సి రావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో విక్రమ్ కుటుంబం పరిస్థితిని కూడా ఆలోచించాలని, వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందికరంగా వ్యవహరించరాదని హితవు పలికారు. ఈ అధికారిక ప్రకటన తో విక్రమ్ ఆరోగ్యం విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నామని, ఊహాగానాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూర్యనారాయణన్ తెలియజేశారు.