కాఫీ విత్ కరణ్ షోలో సమంత చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ షో కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. సమంత నాగ చైతన్యతో ఎందుకు విడిపోయిందో చెబుతుందనేదానికోసమే. అయితే సామ్ విడాకుల తర్వాత ఎంతగానో పరిణితి చెందినట్లు కనిపించింది. ఈ షోలో కరణ్ జోహార్ నుండి వచ్చిన టఫ్ క్వశ్చన్స్‌కి సమాధానాలు ఫట ఫట చెప్పేసింది.
విడాకులు, ట్రోల్స్, టాలీవుడ్‌లో నెపోటిజంపై సూటిగా స్పందించింది. అయితే భరణం కింద సమంతకు 250 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై మాట్లాడుతూ ‘నేను రూ.250 కోట్లు తీసుకున్నట్లు చాలా రూమర్స్ రాశారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. మా విడాకులు అంత సామరస్యపూర్వకంగా జరగలేదు, ఈ పుకార్లు వచ్చినప్పుడు నా ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేస్తారేమో అని ఎదురుచూశా’ అంటూ సెటైరికల్‌గా నవ్వేసింది.
‘డైవర్స్ తీసుకోవడం చాలా కష్టమైన పని. విడాకులు తీసుకున్న కొత్తలో చాలా బాధపడ్డాను. చాలా మనోవేదనకు గురయ్యా జీవితం చాలా కఠినంగా అనిపించింది. విడాకుల తరువాత తనపై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటిపై స్పందించేంత సమయం లేదంటూ సమాధానమిచ్చింది.
కరణ్ టాలీవుడ్ ‘బిగ్ బాయ్స్ క్లబ్’ అనే కమెంట్స్‌పై మీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు సామ్ ‘టాలీవుడ్‌లో చాలా మంది హీరోల పిల్లలు, వారి బంధువుల పిల్లలు మాత్రమే హీరోలు అవుతారు.. కానీ విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు స్టార్‌గా మారడం చాలా అరుదు’ అంటూ ట్యాలెంట్ ఉంటేనే నెగ్గుకొస్తారంటూ చెప్పుకొచ్చింది. స్టార్ పిల్లలు కావడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఉంటుందని, అది తొలి సినిమాకు మాత్రమే పనికొస్తుందని, ఇంకా అంటే మూడు నాలుగు సినిమాల వరకు ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
బాలీవుడ్ నయా స్టార్ రణ్‌వీర్ సింగ్ అంటే తనుకు విపరీతంగా ఇష్టమని.. తన లైఫ్ స్టైల్‌కు, యాటిట్యూడ్‌కు ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చింది. ఐయామ్ కంప్లీట్‌లీ రణ్వీరీఫై అంటూ ఓ కొత్త వర్డ్‌నే కనిపెట్టేసింది సామ్. ఈ షో తరువాత తెలుగు జనాలు సామ్‌పై కాసింత కోపంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కనిపిస్తుంది.