SonuSood: సాయం చేయండి అన్న..సోనుసూద్‌కు భార్యా బాధితుడి ఫన్నీ రిక్వెస్ట్..స్పందించిన రియల్ హీరో

రియల్ హీరో సోనుసూద్ కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో చేసిన సేవల గురించి అందరికీ తెలుసు. ప్యారలల్ గవర్నమెంట్ మాదిరిగా సోనుభాయ్ సాయం చేశారు. కలియుగ దైవం మాదిరిగా కష్టం ఎక్కడున్నా..అక్కడికి వెళ్లి మరీ తన వంతు సాయం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ బాలుడికి హార్ట్ సర్జరీ చేయించారు.

సోనుసూద్ సేవలను సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. కాగా, ఈ నేపథ్యంలోనే కొంత మంది నెటిజన్లు తమ ఫన్నీ కోరికలు నెరవేర్చాలని, సాయం చేయాలని కోరుతుంటారు. ఇటీవల ఓ నెటిజన్ తనకు చల్లటి బీరు కావాలని ట్వీట్ చేశారు. దానికి అదిరిపోయే రిప్లయి ఇచ్చారు సోనుసూద్.. తాజాగా ఓ భార్య బాధితుడు తనకు సాయం చేయాలని సోనుసూద్ ను కోరారు.

మీరు అందరికీ అవసరమైన చికిత్స అందేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు కూడా చికిత్స అందించాలని కోరారు. ‘సోనుసూద్ అన్న.. నా భార్య నా రక్తం ఎక్కువగా తాగుతోంది. దానికి ఏదేని ట్రీట్ మెంట్ ఉందా? దయచేసి సాయం చేయండి అన్న.. ఓ భార్యా బాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని అర్జిస్తున్నాను, అడుగుతున్నాను’ అని ఓ నెటిజన్ సోనుసూద్ ను ట్యాగ్ చేసి ఫన్నీ రిక్వెస్ట్ పెట్టాడు.

ఈ ట్వీట్ కు సోనుసూద్ కూడా ఫన్నీగానే స్పందించారు. ‘అలా చేయడం ప్రతీ భార్య జన్మహక్కు బ్రదర్..మీరు కూడా నాలాగే అదే రక్తంతో బ్లండ్ బ్యాంకు స్టార్ట్ చేయండి’ అని సోనుసూద్ నవ్వుతున్న ఎమోజీ షేర్ చేసి ట్వీట్ చేశాడు. ఇక అది చూసి నెటిజన్లు సోనుభాయ్ అదిరిపోయే రిప్లయి ఇచ్చారని ట్వీట్స్ చేస్తున్నారు. సోనుసూద్ నటించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.