కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆయన సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగులోనూ విడుదలై ఘన విజయం సాధిస్తుంటుంది. చివరగా ప్రేక్షకులకు సూర్య ‘ఈటీ(ఎవడికీ తలవంచకు)’ చిత్రంలో కనిపించారు.
ఈ సంగతులు పక్కనబెడితే..సూర్య సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తుంటారు. సమాజానికి ఉపయోగపడే పనులు సొసైటీ ద్వారా చేస్తుంటారు. తాజాగా తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచి తన గొప్ప మనసు చాటుకున్నారు.
తమిళనాడుకు చెందిన జగదీశ్(27)అనే వ్యక్తి సూర్యకు వీరాభిమాని. రోడ్డు యాక్సిడెంట్ లో జగదీశ్ చనిపోయాడు. దాంతో కుటుంబం దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ పెద్ద లేకపోవడంతో తమ జీవనం గడిచేదేలా? అని వారు బాధపడుతున్నారు. ఈ సమయంలో జగదీశ్ మరణించిన విషయం సూర్యకు తెలిసింది.
వెంటనే జగదీశ్ ఇంటికి వెళ్లారు సూర్య. తన అభిమాని చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అభిమాని కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారితో మాట్లాడారు. జగదీశ్ భార్యకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదని తెలిపారు. జగదీశ్ కూతురు బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటానని, ఎడ్యుకేషన్ కు అయ్యే ఖర్చు తాను పెట్టుకుంటానని సూర్య హామీ ఇచ్చారు.