హిట్ సీక్వెల్స్ ట్రెండ్.. పోస్టర్లతో ఊరించారు.. మరి సెట్స్ పైకి ఎప్పుడో?

-

ఓ సినిమా బంపర్‌ హిట్టు కొట్టిందంటే చాలు అలాంటి సినిమా మళ్లీ ఎప్పుడని అడుగుతారు సినీజనం. ప్రేక్షకుల మనసులను, కలెక్షన్లనూ గెలుచుకున్న సినిమా అంటే ఓ సక్సెస్‌ ఫార్ములా దొరికినట్లే. అలాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు కొనసాగింపు తీయడమే సీక్వెల్‌. మన దగ్గర వీటి ధోరణి తక్కువే కానీ హాలీవుడ్‌లో సంవత్సరం పొడుగునా సీక్వెల్స్‌, ఫ్రాంఛైజీలు అభిమానులను పలకరిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత సీక్వెల్స్, ఫ్రాంఛైజీల​​ విషయంలో సినీప్రియుల్ని బాగా ఆకట్టుకుంది బాలీవుడ్​. క్రిష్​, గోల్​మాల్​, ధూమ్​, హౌస్​ఫుల్​ వంటి ఫ్రాంచైజీలే వీటికి నిదర్శనం. అయితే ఈ సీక్వెల్ ఫార్ములా మెలమెల్లగా సౌత్​కు పాకింది. కానీ అంతగా వర్కౌట్​ అవ్వలేదు. తెలుగులో సాయి కుమార్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వరకు హిట్​ సినిమా సీక్వెల్స్​లో నటించి చేతులు కాల్చుకున్నారు. భీభత్సమైన హైప్​తో విడుదలైన ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిలిచ్చాయి.

అయితే పాన్​ఇండియా లెవల్​లో ‘బాహుబలి’ సిరీస్​ వచ్చి ఆ ముద్రను చెరిపేసింది. అనంతరం కన్నడ చిత్రపరిశ్రమలోనూ పాన్​ ఇండియా లెవల్​లో రూపొందిన ‘కేజీయఫ్’​ సీక్వెల్స్​.. ఈ ఫార్ములాకు మరింత బలాన్ని ఇచ్చింది. దీంతో ఆ ఊపులో సౌత్​లో వీటి హవా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అదే ట్రెండ్​గా మారింది. ఎంతలా అంటే పాన్ ఇండియా వైరస్​లా ఎలా పట్టుకుందో, సీక్వెల్ ఫీవర్ కూడా అంతే పట్టుకుంది. ఇక పుష్ప తొలి భాగం ఘన విజయం సాధించడం.. రెండో భాగాన్ని ప్రకటించడంతో.. అందరీ దృష్టి టాలీవుడ్​పై పడింది. ఇప్పటికే పలువురు దర్శకనిర్మాతలు కూడా.. కొనసాగింపు కథలతో సినిమాలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన కమల్​హాసన్​ విక్రమ్​, కల్యాణ్ ​బింబిసార ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇవి కూడా రెండో భాగం ఉంటాయని దర్శకనిర్మాతలు ప్రకటించారు. దీంతో ఇప్పుడందరీ దృష్టి ఈ చిత్రాలపై పడింది. ఎప్పుడొస్తాయని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. చాలా హిట్​ సినిమాల సీక్వెల్స్​ ప్రకటించి ఇప్పటికే చాలా కాలమైనా ఒకటి రెండు మినహా ఇంకా ఏమీ సెట్స్​పైకి వెళ్లలేదు. కానీ వాటి మీద భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఓ సారి చూసేద్దాం…

‘పుష్ప 2’.. టాలీవుడ్​ నుంచి బాలీవుడ్​ వరకు ఇండియన్​ ఇండస్ట్రీతో సహా సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మొట్టమొదటి చిత్రం ఇదే. ఎందుకంటే తొలి భాగం అంతలా ఆకట్టుకుంది. సోషల్​మీడియా ఇంట బయట ఎక్కడ చూసిన పుష్ప ఫీవరే. రీల్స్, సాంగ్స్​, డైలాగ్స్​తో నెటిజన్లు తగ్గేదే లే అంటూ తెగ సందడి చేశారు. మొత్తంగా బన్నీ గెటప్​, యాక్షన్​ సినిమాకే హైలెట్​. అయితే ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగం ప్రకటించినప్పటికీ.. ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్​.. కథలో మార్పులు చేసి.. తారలను ఎంపిక చేసే ప్రక్రియలో బిజీగా ఉన్నారని తెలిసింది.

హిట్​ 2 విశ్వక్​సేన్​ హీరోగా వచ్చిన క్రైమ్​ థ్రిల్లర్​ ‘హిట్‌’ సూపర్​ హిట్​గా నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘హిట్‌ 2’ను ప్రకటించి.. షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ చిత్రీకరణ ఎక్కడ వరకు వచ్చిందో స్పష్టత రాలేదు. కనీసం ఎటువంటి అప్డేట్స్​ కూడా రాలేదు. ఇందులో హీరో అడివిశేష్​ ప్రధాన పాత్ర పోషించారు. ‘హిట్‌’ను తెరకెక్కించిన శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే ఈ రెండో భాగం రూపొందుతోంది. సంగీతం-జాన్‌ స్టీవర్స్‌ ఎడురి, ఛాయాగ్రహణం-మణికందన్‌ అందించనున్నారు.

గూఢచారి.. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం ‘గూఢచారి’. చూపు తిప్పుకోనివ్వని కథ, కథనాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామ, అభిషేక్‌ అగర్వాల్‌, టి.జి. విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. శోభిత దూళిపాళ్ల, ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ ఉత్కంఠభరిత చిత్రానికి సీక్వెల్‌ తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం కొన్నాళ్ల క్రితమే ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఇది కూడా ఎక్కడివరకు వచ్చిందో తెలియలేదు.

ఇండియన్​ 2.. కమల్‌హాసన్‌- శంకర్‌ల క్రేజీ ప్రాజెక్ట్‌ ‘భారతీయుడు 2’. గతంలో వీరి కలయికలోనే వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే దాదాపు 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పలు కారణాలతో చాలా కాలంగా ఆగిపోయింది. మళ్లీ సెట్స్​పైకి ఎప్పుడు వెళ్తుందా అని అభిమానులు ఎదురుచూశారు. అయితే ఇటీవలే తాజా ఈ విషయమై హీరోయిన్​గా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ స్పష్టత ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ 13న తిరిగి ప్రారంభమవుతుందని.. ఈ షెడ్యూల్‌తోనే తాను తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం శంకర్‌.. రామ్‌చరణ్​తో ఆర్​సీ 15 చేస్తున్నారు.

ఖైదీ 2, విక్రమ్​ 2.. లోకేష్​ కనగరాజ్​ తెరకెక్కిస్తున్న మల్టీవర్స్​ చిత్రాలు ‘ఖైదీ’, ‘విక్రమ్’. ఈ రెండు చిత్రాలు విడుదలై ఘన విజయాలు సాధించాయి. వీటి సీక్వెల్​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ​సీక్వెల్​లో కమల్​హాసన్​, కార్తి, విలన్​గా సూర్య కలిసి నటిస్తారు. అయితే కార్తి నటించిన ‘విరుమాన్‌’ తమిళ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. దీని ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కార్తి .. ‘ఖైదీ-2’ గురించి మాట్లాడారు. వచ్చే ఏడాది చివర్లో ఖైదీ-2 ప్రారంభమయ్యే అవకాశముందని చెప్పారు. కాగా, ప్రస్తుతం దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌.. ‘దళపతి-67’ సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కమల్​హాసన్​ ఇక భారతీయుడు 2 కోసం సిద్ధం అవుతున్నారు. ఇవ్వన్నీ పూర్తవ్వగానే ‘ఖైదీ’, ‘విక్రమ్​’ సీక్వెల్స్​ రానున్నాయి.

కేజీయఫ్ 3 .. ‘కేజీయఫ్-2’.. భారీ అంచనాలతో ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభించింది. ఓ సంచలనం సృష్టించింది. ఇక ఈ చిత్ర క్లైమాక్స్​లో ఊహించని సర్​ప్రైజ్​ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్​ నీల్​.. కేజీయఫ్​ 3 ఉంటుందని చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత నిర్మాతలు కూడా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడనేది చెప్పలేదు. ప్రస్తుతం ప్రశాంత్​ నీల్​.. ప్రభాస్​తో సలార్​తో బిజీ అయ్యారు. అలాగే త్వరలోనే ఓ కొత్త ప్రాజెక్ట్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్​లు పూర్తయ్యాకే కేజీయఫ్​ 3 తెరకెక్కే అవకాశముంది.

దృశ్యం 3.. నటుడు మోహన్‌లాల్‌, దర్శకుడు జీతూ జోసెఫ్‌ల కలయికకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరి కలయిక నుంచి వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. అలానే దృశ్యం 3 కూడా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అయితే కనీసం మూడేళ్ల సమయం పడుతుందని ముందే క్లారిటీ ఇచ్చారు. ఇది వస్తే.. ఇప్పటికే తొలి రెండు భాగాలతో తెలుగులో సందడి చేసిన విక్టరీ వెంకటేశ్.. మూడో భాగాన్ని కూడా రీమేక్​ చేసి అలరిస్తారు.

ఇక తెలుగులో ఫన్ అండ్​ ఫుల్ కామెడి​ ఎంటర్​టైన్మెంట్​ ఫ్రాంచైజీ ఎఫ్​ సిరీస్​. ఈ ఫ్రాంచేజీలో వచ్చిన ఎఫ్​ 2, ఎఫ్​ 3 సూపర్​హిట్​ అందుకున్నాయి. అయితే దర్శకుడు అనిల్​రావిపూడి ప్రస్తుతం బాలయ్యతో ఓ సినిమా ప్రారంభించబోతున్నారు. ఇది పూర్తయ్యాక ఎఫ్​ 4 ఉంటుంది.

ఈ చిత్రాలతో పాటు ఇంకా పలు చిత్రాలు ఉన్నాయి. వాటిలో క్లాసిక్ హిట్​ చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’, ఇంకా ప్రభాస్​ ‘సలార్’​, ‘ప్రాజెక్ట్ కెట’, రజనీకాంత్​ చంద్రముఖి ‘సీక్వెల్’​, రణ్​బీర్​ కపూర్​ ‘బ్రహ్మాస్త్రం’ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version