‘విరాట పర్వం’ వెన్నెల అసలు కథ ఆమెదే.. ఓరుగల్లు బిడ్డ సరళ స్ఫూర్తితో సినిమా..

వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాట పర్వం’ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. పూర్వపు ఓరుగల్లు జిల్లా ప్రస్తుత ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1990లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వేణు.

పీపుల్స్ వార్ ఉద్యమంలోకి దిగిన సరళ నిజ జీవిత చరిత్ర ఆధారంగా..ప్రేమను జోడించి ఈ సినిమా తీశారు డైరెక్టర్. ఖమ్మం జిల్లాకు చెందిన స్వరాజ్యం-భిక్షమయ్య దంపతుల చిన్న కూతురు అయిన సరళ..వామపక్ష భావాలు కలిగి ఉంది. 1985లో వీరు ఖమ్మంకు వెళ్లినప్పటికీ వీరి సొంతూరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి మోరందపల్లి.

ఉద్యమంలోకి వెళ్లాలనే భావనతో ఉన్న సరళ..ఎవరికీ చెప్పకుండా అడవి బాట పట్టింది. అప్పుడు పీపుల్స్ వార్ లో పని చేస్తున్న శంకరన్న..ను కలవాలనుకుంది. అలా ఖమ్మం నుంచి నిజామాబాద్ అడవిలోకి వెళ్లింది. కానీ, పీపుల్స్ వార్ ఉద్యమ కారులు సరళను పోలీస్ ఇన్ ఫార్మర్ అనుకుని హతమార్చారు. పీపుల్స్ వార్ వారు విడుదల చేసిన లేఖ ద్వారా ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. ఈ రియల్ స్టోరిని ఆధారం చేసుకుని..వేణు ఊడుగుల ‘విరాట పర్వం’ సినిమా తీశారు.