కులమతాలకతీతంగా జరుపుకునే వినాయక నిమజ్జన వేడుకల్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గణపయ్య ప్రతిమను తాకాడని ఓ దళిత బాలుడిపై కొందరు దారుణంగా మూకదాడికి పాల్పడ్డారు. వారి దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా సదర్ కొత్వాలి గ్రామంలో చోటుచేసుకుంది.
కొత్వాలి గ్రామంలో దళిత వర్గానికి చెందిన సన్నీ గౌతమ్ అనే బాలుడు స్నేహితులతో ఆడుకుంటూ మండపంలోకి వెళ్లి గణేశుడి ప్రతిమ పాదాలను తాకే యత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మండపం నిర్వాహకుడు బబ్బన్ గుప్త తన ఇద్దరు కుమారులతో కలసి బాలుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ బాధిత బాలుడికి గాయాలయ్యాయి. దీనిపై దళిత బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ బాలుడు మద్యం తాగి మండపంలోకి రావడం వల్ల గొడవ జరిగిందని బబ్బన్ గుప్త కుటుంబం తెలిపింది.