సూరత్ లో డైమండ్ గణపతి.. ఒక్కరోజే దర్శనం

-

దేశమంతా వినాయక చవితి సంబురాల్లో మునిగిపోయింది. వీధివీధినా వినాయకుడు కొలువుదీరాడు. సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన మండపాల్లో గణేశ్ వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొలువుదీరిన గణపతి ప్రతిమలు భక్తులను భలేగా ఆకర్షిస్తున్నాయి. అక్కడి గణపయ్యను చూడటానికి భక్తులు క్యూ కడుతున్నారు. అలాంటి ఓ విశేష గణపతి విగ్రహం గురించి తెలుసుకుందామా..?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వినాయక విగ్రహం.. అదేనండి కోట్లు విలువజేసే వినాయకుడు డైమండ్ సిటీగా ఖ్యాతిగాంచిన సూరత్ లో ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ బట్టల వ్యాపారానికే కాదు.. వజ్రాల వ్యాపారానికి ఖ్యాతిగాంచింది. డైమండ్ సిటీగా ఖ్యాతిగాంచిన ఈ నగరం వజ్రాల పాలిషింగ్, వ్యాపారంలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అటువంటి ఈ డైమండ్ సిటీలో డైమండ్ వినాయకుడు కొలువుదీరాడు. ఈ గణపయ్యను దర్శించాలంటే ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోవాలి. ఈ లంబోదరుడి విగ్రహం ఎక్కడ ఉందనేది కూడా అత్యంత రహస్యంగానే ఉంది. ఎందుకంటే ఈ వినాయకుడు అసలైన వజ్రంతో తయారయ్యాడు. దీని విలువ కోట్లలో ఉంటుంది.

సూరత్‌లోని మహీదర్‌పురాకు చెందిన కరమ్ గ్రూప్ చైర్మన్ వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియా ఈ వజ్ర వినాయకుడి బెల్జియం నుంచి తీసుకొచ్చారు. 182.53 క్యారెట్ల వజ్రంలో గణేశుని రూపం స్పష్టంగా కనిపిస్తుంది. బెల్జియం వజ్రాల గనిలో నుంచి బయటకు వచ్చిన ఈ వజ్రంలో గణేష్ తొండం, చేతులు, కళ్లు, కాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. 82.53 క్యారెట్ రఫ్ డైమండ్ ఆఫ్రికాలో గనుల నుంచి బయటపడింది. పసుపు బూడిద రంగు వజ్రం దాదాపు 48 mm ఎత్తు, 32 mm వెడల్పు , 20mm మందంతో ఉంటుంది. దీని బరువు 36.50 గ్రాములు. ఈ వజ్రం విలువ సుమారు రూ. 600 కోట్లు ఉండవచ్చని నిపుణుల అంచనా. ఈ గణపయ్యను దర్శించుకోవాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవడానికి కానూభాయ్ కార్యాలయానికి కాల్ చేయాలి. అప్పుడు దర్శనం చేసుకునే టైం స్లాట్ ఇస్తారు. దానికి అనుగుణంగా వెళ్లి.. బొజ్జ గణపయ్యని దర్శించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version