ఎడిట్ నోట్: మునుగోడు ముచ్చట.!

-

మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 7వ తేదీన మొదలైన నామినేషనలు..14వ తేదీకి ముగిశాయి. ప్రధాన పార్టీల నుంచి.. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. అలాగే టి‌జే‌ఎస్ పార్టీ నుంచి పల్లె వినయ్ కుమార్, ప్రజాశాంతి పార్టీ నుంచి మొదట గద్దర్ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.

కానీ అనూహ్యంగా గద్దర్ సైడ్ అవ్వడంతో..కే‌ఏ పాల్ నామినేషన్ వేశారు. ఓవరాల్ గా చూసుకుంటే మునుగోడులో వందకు పైగా నామినేషన్లు పడ్డాయని తెలిసింది. నిరుద్యోగులు, భూ నిర్వాసితులు ఇంకా పలు వర్గాల వారు నామినేషన్స్ వేసినట్లు తెలిసింది. అయితే 17వ తేదీన ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. మరి అప్పటికి ఎంతమంది రేసులో ఉంటారో చూడాలి. ఇక ఎంతమంది బరిలో ఉన్నా సరే మునుగోడులో అసలు పోరు మాత్రం టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్యే జరగనుంది.

ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు..ఇప్పటికే మూడు పార్టీల అభ్యర్ధులు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు మునుగోడులో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఎవరి ఎత్తులతో వారు గెలవడానికి చూస్తున్నారు..ఇక మునుగోడులో విపరీతంగా ఖర్చు కూడా చేస్తున్నారు. అటు టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేలు, మంత్రులు..ఇతర నేతలు మునుగోడులో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఇటు బీజేపీ తరుపున రాష్ట్ర స్థాయి లీడర్లు మునుగోడులో ఉన్నారు. తాజాగా బీజేపీ మండల ఇన్‌చార్జిలను కూడా నియమించారు.

ఆరు మండలాలు, రెండు మునిసిపాలిటీలకు ఇన్‌చార్జిలతో పాటు సహ ఇన్‌చార్జులను కూడా నియమించారు. పార్టీ సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక కాంగ్రెస్ నుంచి స్రవంతి ఇప్పటికే ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. స్రవంతి గెలుపు కోసం టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. తాజాగా 38 మంది స్టార్‌ క్యాంపెయినర్లని నియమించారు. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు మొదలుకుని.. దాదాపు పార్టీ ముఖ్య నాయకులందరూ ఉన్నారు. అయితే వెంకటరెడ్డి ఇప్పటికే ప్రచారానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉండటంతో వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. అయితే పరోక్షంగా రాజగోపాల్ రెడ్డికి సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ప్రచారం పక్కన పెడితే..ఇంకా బలమైన నాయకులని తమ వైపుకు తిప్పుకునేందుకు అన్నీ పార్టీలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. అలాగే ప్రతి నాయకుడుకు ఓ రేటు ఫిక్స్ చేసి లాగేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు. తాజాగా ఢిల్లీకి వెళ్ళిన ఆయన.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్‌ను కలిశారు. ఇక అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరనున్నారు.

టీఆర్ఎస్ సీటు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇవ్వడంపై బూర అసంతృప్తిగా ఉన్నారు. పైగా తమకు ప్రాధాన్యతకు ఇవ్వడం లేదని బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇలా అసంతృప్తిగా ఉన్న బూర..బీజేపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బూర వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో చూడాలి. మొత్తానికి మునుగోడులో గంట గంటకు ఒక ట్విస్ట్ అన్నట్లు రాజకీయం నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news