ఎడిట్ నోట్: కారు వర్సెస్ కమలం..గేమ్ ఫిక్స్..!

-

మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, ఏదేమైనా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవుతుందని..బీజేపీ దూకుడుగా రాజకీయం చేసిన సంస్థాగత బలం మాత్రం కాంగ్రెస్ పార్టీదే ఉందని, కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత హడావిడి చేసిన టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోరు జరుగుతుందని అంతా భావించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిన, టీఆర్ఎస్ ఓటమి పాలైన, కాంగ్రెస్ మరీ దారుణంగా ఓడినా సరే..ఆ గెలుపు బీజేపీ వల్ల వచ్చింది కాదని, అక్కడ నేతల వల్ల వచ్చిందని అనుకున్నారు.

కానీ తాజాగా మునుగోడు ఉపఎన్నిక ఫలితం చూశాక..ఇంకా కాంగ్రెస్ పార్టీ రేసులో నుంచి పక్కన పెట్టొచ్చు అనే విధంగా పరిస్తితి ఉంది. టీఆర్ఎస్-బీజేపీల మధ్య హోరాహోరీగా ఫైట్ జరిగింది..ఈ ఫైట్ లో కేవలం 10 వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచి గట్టెక్కింది. బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అయితే అసలు ఇక్కడ బీజేపీకి బలమే లేదు..ఎంత అనుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సొంత ఇమేజ్ ఉందనుకున్న..ఆ స్థాయిలో ఓట్లు పడే ఛాన్స్ కూడా లేదు.

అంటే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అర్ధమవుతుంది..టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎలాగో పోరాడలేకపోతుంది. అసలు తమ సొంత సీటు, బలమైన క్యాడర్ ఉంది..గ్రౌండ్ లెవెల్‌లో ఓటర్ల బలం ఉంది. అయినా సరే 23 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయింది. ఈ మునుగోడు ఫలితం బట్టి చూస్తే..ఇంకా రానున్న రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే పోరు నడవనుంది అని అర్ధమవుతుంది.

ఇక క్షేత్ర స్థాయిలో బీజేపీలోకి బలమైన నాయకులు వచ్చే ఛాన్స్ ఉంది…అలాగే సగంపైనే స్థానాల్లో సంస్థాగత బలం లేకపోయినా..ఇక నుంచి టీఆర్ఎస్ వ్యతిరేక వర్గం బీజేపీ వైపు చూడటం ఖాయంగా కనిపిస్తోంది. బలహీన పడుతున్న కాంగ్రెస్ వైపు చూడటం కష్టమని అర్ధమవుతుంది. మొత్తానికి చూసుకుంటే రాష్ట్రంలో కారు..కమలం మధ్య అసలు గేమ్ ఇప్పుడు మొదలు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news