లాక్ డౌన్ నేర్పుతున్నవి ఇవే…!

అలారం మోగుతుంది… స్నూజ్ చెయ్యాలి. అప్పుడే తెల్లారిందా…? ఫోన్ స్క్రీన్ టచ్ చేస్తే అమ్మో టైం ఆరు అయిపోయింది. లేలే వేళ్ళు బ్రష్ చెయ్… ఆఫీస్ కి టైం అవుతుంది. గంట లేట్ అయిందో అమీర్ పేట్ లో ట్రాఫిక్ తట్టుకోలేము, అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్ళే వరకు ట్రాఫిక్. వామ్మో భరించలేము. ఒరేయ్ రెడీ అవ్వు నాకు టైం అయిపోయింది. మళ్ళీ స్కూల్ లేట్ అవుతుంది నీకు.

వంట అయిందా ఎంత సేపు చేస్తావ్ అసలు…? ఏదొకటి నాకు రెండు ఇడ్లీ చాలు. కొంచెం చెట్నీ వేసి పెట్టు స్నానం చేసి వస్తాను. ఏంటి రా బాబు నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా…? బాక్స్ లో పెరుగు అన్నం తక్కువ పెట్టు. నిద్ర వచేస్తుంది ఆఫీస్ లో. కార్ కీ ఎక్కడ ఉంది…? నాన్న సాయంత్రం మూవికి వెళ్దామా…? కళ్ళు కనపడుతున్నాయా నీకు…? వచ్చేసరికి నాకు ఎంత లేట్ అవుతుంది చూడు. వీకెండ్ చూద్దాం.

ఇదో నరకం… అవును డబ్బులు వస్తాయి కుటుంబం తో ఉంటాం గాని ఇదో నరకం. హైదరాబాద్ లో విజయవాడ లో విశాఖలో ఈ జీవితాలు లక్షల్లో ఉన్నాయి. కట్టుకున్న పెళ్ళాం తో మాట్లాడలేని బ్రతుకులు, కన్న కొడుకుతో మాట్లాడలేని జీవితాలు. సరదాగా మాట్లాడలేక ఇంటికి వచ్చి వాలిపోయి మంచం మీద పడి ఏసీ వేసుకుని పడుకుని… పెళ్ళాం పాలు ఇస్తేనో పెరుగు అన్నం పెడితేనో తిని పడుకోవడం.

ఈ జీవితం ఎంత కాలం ఉంటుంది చెప్పండి…? ఎన్నాళ్ళు ఈ నరకం ఉంటుంది చెప్పండి…? కరోనా వైరస్ పుణ్యమా అని అందరూ కూడా ఇళ్ళల్లోనే ఉంటున్నారు. బయటకు వెళ్ళడం, ట్రాఫిక్ గోల లేదు. హడావుడి జీవితం లేదు. ఆఫీస్ గోల లేదు, పిల్లల స్కూల్ లేదు. వండుకోవడం తినడం, సంతోషంగా మాట్లాడుకోవడం. ఎన్నో నేర్పింది కరోనా మన జీవితానికి. అమ్మా నాన్నతో కాసేపు సమయం గడపడం.

పిల్లలతో నవ్వుకోవడం, పిల్లలను ఆడించడం, పిల్లలను దగ్గరకు తీసుకోవడం. ఇలా ఏది చూసినా సరే కరోనా వైరస్ ఇప్పుడు మనకు ఎన్నో నేర్పింది. లాక్ డౌన్ పుణ్యమా అని అమ్మ ప్రేమ, భార్య ప్రేమ, పిల్లలతో ఉండే సంతోషం అన్నీ కూడా ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. జీవితం ఇంత అందంగా ఉంటుందా అని లక్షలు సంపాదించే ఉద్యోగి మనసులో అనుకోకుండా ఉంటాడా…? ఏటీఎం కార్డ్ గీకినప్పుడు ఉన్న సంతోషం కంటే ఇది వేల రెట్లు విలువైనది.