ఎడిట్ నోట్: రాజా..చేయి దాటితే..!

-

రాజాసింగ్…ఈ పేరుకు పెద్ద పరిచయం అక్కర్లేదనే చెప్పాలి…తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు.. మొదట హిందూ వాహిని సభ్యుడిగా.. గో సంరక్షణ, శ్రీరామ నవమి శోభాయాత్రల నిర్వహణతో రాజాసింగ్ హైలైట్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి… కార్పొరేటర్‌గా  గెలిచి…నెక్స్ట్ బీజేపీలోకి వెళ్ళి… 2014 ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసి..దాదాపు 46 వేల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎవరు ఎమ్మెల్యే గెలవలేదు..కానీ ఒక్క రాజాసింగ్ మాత్రం గోషామహల్ నుంచి మరొకసారి గెలిచారు. ఇలా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌.. తన వ్యాఖ్యలతో తరచూ వివాదాస్పదం అవుతుంటారు. అయితే ఎప్పుడు ఏదోఒక వివాదంలోనే ఉంటారు…అందుకే ఆయనపై 42 కేసులు వరకు నమోదు అయ్యాయి…ఇందులో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కేసులు ఎక్కువ ఉంటాయి.

ఒక మతాన్ని టార్గెట్ గా పెట్టుకుని రాజాసింగ్ మాట్లాడుతుంటారు. ‘‘నాకు ముస్లింల ఓట్లు అక్కర్లేదు. ధర్మం కోసం అవసరమైతే చంపడానికి అయినా, చావడానికి అయినా సిద్ధం’’ వంటి అనేక వివాదాస్పద ప్రకటనలు గతంలో చాలాసార్లు చేశారు. అయితే విధాన పరంగా విమర్శలు చేయొచ్చు..కానీ మతాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించడం ఏ మాత్రం సమర్ధనీయం కాదనే చెప్పాలి. ఎప్పుడు ఎం‌ఐ‌ఎం నేతలతో కయ్యం పెట్టుకుంటూనే ఉంటారు. ఇలా ఎప్పుడు వివాదాల్లో ఉండే రాజాసింగ్ తాజాగా….అతి పెద్ద వివాదంలో చిక్కుకోవడమే కాకుండా..ఏకంగా బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రాజాసింగ్‌ ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు. ఇక ఆ తర్వాత రాజాసింగ్… స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ నిర్వహించ తలపెట్టిన ప్రదర్శనకు వ్యతిరేకంగా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు దాదాపు 10 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇలా వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ ఎం‌ఐ‌ఎం పార్టీ సహా పలువురు ముస్లిం సంఘాల ప్రతినిదులు పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టారు. ఇదే క్రమంలో పోలీసులు రాజాసింగ్‌ని అరెస్ట్ చేశారు…సోషల్ మీడియాలో ఆ వీడియోని కూడా తొలగించారు. అయితే రాజాసింగ్‌ అరెస్టుకు ముందు 41(ఏ) క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) ప్రకారం నోటీసులు ఇవ్వలేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించడం…ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు రాజాసింగ్‌ను విడుదల చేసింది.

కానీ ఊహించని విధంగా రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. పడింది. అలాగే బీజేపీలోని అన్నీ పదవుల బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించింది. ఇక పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. మొత్తానికి రాజాసింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారి..చివరికి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే వరకు పరిస్తితి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news