తల్లిదండ్రులూ.. మీరు మారాలి.!

అమ్మానాన్న అనే పువ్వులకు పుట్టిన సౌరభాలు – పిల్లలు. వాళ్లు మన ప్రేమకు ప్రతీకలు. వాళ్లకు ముల్లు దిగితే, మనకు గునపం దిగినట్లుగా ఉంటుంది. వాళ్లను దారిలో పెట్టాలితప్ప, దండించకూడదు. ఒక తల్లిగా, తండ్రిగా, కుటుంబానికి, సమాజానికి ఒక బాధ్యతగల పౌరుడిని అందించగలగాలి తప్ప డబ్బు సంపాదించే మెషిన్ను కాదు. చదవనివ్వండి… చేయనివ్వండి… స్వేచ్చగా.. ఇష్టంగా.. కానీ సరైన పద్ధతిలోనే. తల్లయ్యారు.. తండ్రయ్యారు..ఇక స్నేహితులవ్వండి.. మార్గదర్శిగా మారండి.

‘అపజయమే విజయానికి సోపానం’

ఇంటర్‌ పరీక్షాఫలితాలు చూసాక, ఏడెనిమిది మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత క్షోభ? ఎంత దుఃఖం? ఆ బాధ వర్ణనాతీతం. అందరు తల్లిదండ్రుల గుండె కన్నీటిసంద్రమయింది. అయ్యో.. పరీక్షదేముంది? మళ్లీ రాసి, పాసవచ్చు కదా. ప్రాణం పోతే తిరిగివస్తుందా? అని మనమే అంటున్నాము. కానీ, ఆ భయం, ఒత్తిడి వాళ్ల గుండెల్లో ఎంత పేరుకుపోయిందో గమనించారా? లేదు. మనకి అవేవీ అవసరం లేదు. అసలు పిల్లలను ఎలా పెంచాలో ఎంతమందికి తెలుసు? అంతటికీ కారణం నేటి తల్లిదండ్రులే. వాళ్ల ఆశలు వీళ్లమీద రుద్దడం, వాళ్లకు చేతకాకపోతే తిట్టడం, కొట్టడం, భయపెట్టడం. నువ్వు డాక్టర్‌ కావాలి, ఇంజనీర్‌ కావాలి, కలెక్టర్‌ కావాలి.. అని చిన్నప్పటినుంచే నూరిపోయడం బాగా అలవాటయిపోయింది. అంతే కానీ, వాడికేది ఇష్టం? ఎందులో ప్రావీణ్యం ఉంది? అని అడిగారా ఎప్పుడైనా? లేదు. వాళ్ల చదువు పోకడ, ఇంట్లో వాళ్ల ప్రవర్తన, వాళ్లకు ఇష్టమైన టైంపాస్‌… వీటిని సరిగ్గా గమనిస్తే ఏ సమస్యలు రావు. మన గొప్పదనం కోసమైనా, వారికో స్మార్ట్‌ఫోన్‌ – అపరిమిత డాటాతో. ఇదొక్కటి చాలు.. రామున్నయినా రావణున్ని చేయడానికి. జియో సిమ్‌కార్డ్‌, యూట్యూబులు, వాట్సప్‌లు, ఫేస్‌బుక్కులు, టిక్‌టాక్‌లు, పబ్‌జీలు… చాలవా? ప్రళయం మొదలవడానికి? తప్పంతా మన దగ్గర పెట్టుకుని వాళ్లను దండిస్తే ప్రయోజనమేమిటి? వద్దు. ఇక చాలు.

చదువు..విజ్ఞానాన్ని సంపాదించడానికి, ఆ విజ్ఞానం కుటుంబానికి, ప్రజలకు, సమాజానికి, దేశానికి ఉపయోగపడడానికి. ఫలానా చదువు చదివితే, ఫలానా ఉద్యోగమొస్తొంది. బాగా జీతమొస్తుంది. మంచిగా లైఫ్‌లో సెటిల్‌ అవ్వచ్చు. నిజానికి ఇదేమీ గొంతెమ్మకోరిక కాదు. తప్పసలే కాదు. కానీ, డబ్బు సంపాదించాలంటే మంచి ఉద్యోగమే రావక్కరలేదు. మీకే తెలుసు. బయట లక్షలు సంపాదిస్తున్నవారు ఏం చదివారో? కాకపోతే, సమాజంలో గౌరవంగా, హుందాగా జీవించాలనే తపనతో పిల్లలను పీడించడం మాత్రం సరికాదు. ఏ రంగం ఎంచుకున్నా, అందులో వాళ్లు రాణించేవిధంగా ప్రోత్సహించండి. ఐఐటీలు, ఎంబీబీఎస్‌లు, ఐఏఎస్‌లకు మాత్రమే కాదు… కవులకు, కళాకారులకు, వ్యాపారవేత్తలకు, క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు, రాజకీయవేత్తలకు కూడా గౌరవమర్యాదలు లభిస్తాయి. మీకు తెలుసా… మనం వంటవాడని తేలిగ్గా తీసిపారేసే చెఫ్‌లకు కూడా స్టార్‌ హోటళ్లో అయిదారు లక్షల జీతముంటుంది. పైగా విపరీతమైన డిమాండ్‌ కూడా. దేన్ని తక్కువగా అంచనా వేయకూడదు. చిన్నచూపు చూడకూడదు. మన పిల్లవాడు అందులో ఆసక్తిచూపితే, కానివ్వండి. తప్పేంలేదు. ఎదుగుతాడు. అందులోనే గొప్పవాడవుతాడు.

మీ పిల్లzకు ఆసక్తి ఉన్నదాంట్లోనే, సరిగ్గా రాణించలేకపోతుంటే, అదీ సమస్య. మాట్లాడండి. లాలించండి. మేమున్నామని ధైర్యం చెప్పండి. సమస్యకు మూలకారణం కనుక్కునే ప్రయత్నం చేయండి. పట్టుదల, బలమైన కోరిక, కృషి… వీటి గొప్పదనమేమిటో వివరించండి. వాళ్లు ఎక్కడ ఫెయిలవుతున్నారో అర్థమయేలా చెప్పండి. వారికి ఇప్పుడు ఏదయితే కఠినంగా తోస్తోందో, దాన్ని ఇదివరకు లక్షలమంది సాధించారనీ, తన తర్వాత కూడా లక్షలమంది సాధిస్తారన్న నిజాన్ని తెలియజెప్పండి. విజయం సాధించినవారెవరూ తనకంటే గొప్పవాళ్లేంకాదని వాళ్లకు తెలియాలి. ‘వాళ్లు కష్టపడ్డారు, నువ్వు కష్టపడలేదు. అంతే తేడా. ఈసారి నువ్వు కష్టపడు. నువ్వూ విజయం సాధిస్తావు. ఇదే విజయసూత్రం’… అని మనం చెప్పగలిగితే చాలు.

ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, అబ్రహం లింకన్‌, మైఖేల్‌ జాక్సన్‌, బిల్‌ గేట్స్‌, స్టీవ్‌ జాబ్స్‌, సచిన్‌ టెండుల్కర్‌, చాలామంది సినీస్టార్స్‌… చదువులో పెద్దగా రాణించలేదు. కొందరికి టీసీలు ఇచ్చి ఇంటికి కూడా పంపేసారు. అయినా వాళ్లకి నచ్చిన రంగంలో విశేషంగా రాణించి గొప్పవారుగా పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఓటమిని మించిన గురువు లేడు. ఫెయిలయినవాడికంటే అనుభవజ్ఞుడు లేడు. థామస్‌ అల్వా ఎడిసన్‌, 1000 సార్లు ఫెయిలయ్యాక బల్బు కనుగొన్నాడు. ఆసక్తి అన్నింటికీ మూలం. పట్టుదల దానికి తోడు. పిల్లలకు స్వతహాగానే మంచి తెలివితేటలుంటాయి. సైన్స్‌లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేనివాడు, బాహుబలికి స్టంట్‌మేన్‌ ఎవరో చెప్తాడు. మ్యాథ్స్‌లో ఒక లెక్కకు సరిగ్గా స్టెప్స్‌ వేసి, ఆన్సర్‌ తెప్పించలేని వాడు, పబ్‌జీ గేమ్‌ ఎలా గెలవాలో నేర్పిస్తాడు. జస్ట్‌ ఇంట్రెస్ట్‌ అంతే..! దాన్ని సరియైన దిశగా మళ్లిస్తే చాలు… విజయ పరంపర మొదలు.

పిల్లలను ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా డీల్‌ చేయాలి. కొన్ని సూచనలు

  • ఫెయిలయినప్పుడు బాధ సహజం. బాధపడనివ్వండి.
  • తిట్టడం, కొట్టడం, వెటకారంగా దెప్పిపొడవడం చేయకండి. చాలా ప్రమాదం.
  • ఎవరితోనూ పోల్చకండి. ఇంకా ఎక్కువ హర్ట్‌ అవుతారు.
  • ప్రతీవారూ ఎప్పుడోఒకప్పుడు ఫెయిలయినవారేనని తెలియజెప్పండి. మీ అనుభవం కూడా చెప్పండి.
  • ఇదివరకు తను సక్సెస్‌ అయిన ఎగ్జామ్‌ విషయం గుర్తుచేయండి.

మనలో మన మాటలు:

  • ఈ ఒక్క అపజయం తనను అంచనా వేయలేదు.
  • పరీక్ష రాసి ఫెయిలయినవాడు కాదు, అసలు పరీక్షే రాయనివాడు ఓడిపోయినట్టు.
  • ప్రాణం ఉన్నవాడే ఏదైనా సాధించగలడు. చచ్చి సాధించేమీలేదు. అది పిరికితనం.
  • క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల… ఈ మూడు ఎవరినైనా విజయతీరాలకు చేరుస్తాయి.

-దేదీప్య
(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)