ఎడిట్ నోట్: సరికొత్త ‘కేసీఆర్’!

-

రాజకీయాల్లో కేసీఆర్ మార్క్ రాజకీయం వేరు…ఆయన ఎప్పుడు ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తారో…ఎలాంటి రాజకీయ సమీకరణాలని తెరపైకి తీసుకొస్తారో ఎవరికి క్లారిటీ ఉండదు. అలాగే ఒక సీఎంగా ఉంటూ…కేవలం ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్‌కు పరిమితమవుతూ ప్రభుత్వాన్ని నడిపించడంలో ధిట్ట. ఎవరెన్ని విమర్శలు చేసిన తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. ఇక ఏదో కావలసిన వారికే తప్ప…సొంత పార్టీ వాళ్ళకు కూడా కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం కష్టమనే విమర్శలు కూడా ఉన్నాయి.

అలాగే ప్రజల్లోకి కూడా పెద్దగా రారు…ఏదో ఎన్నికల సమయంలో తప్ప…అయినా సరే తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలు అమలు చేస్తూ…విజయాలు అందుకోవడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ హవా పెరిగిందో అప్పటినుంచి కేసీఆర్‌లో మార్పు వచ్చింది. ఇటీవల కాలంలో సరికొత్త కేసీఆర్‌ని చూడాల్సి వస్తుంది. తన రెగ్యులర్ రాజకీయానికి విరుద్ధంగా కేసీఆర్ ముందుకెళుతున్నారు.

మామూలుగా ప్రగతి భవన్ వదిలి రాని కేసీఆర్….ఇప్పుడు జనాల్లోకి వస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక ముందు నుంచే కేసీఆర్ ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. అంటే బీజేపీతో రిస్క్‌ని గమనిచ్చి…కేసీఆర్ ప్రజల్లో తిరగడం స్టార్ట్ చేశారు. అలాగే బీజేపీపై విమర్శలు చేస్తూనే….ప్రజలకు వరాలు కురిపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇక అన్నిటికంటే పెద్ద మార్పు ఏంటంటే…సాధారణంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ ఉండదనే విమర్శ ఉంది.

సొంత పార్టీ ఎమ్మెల్యేలని కలవడానికే కేసీఆర్ ఛాన్స్ ఇవ్వరు. ఏదో కొంతమందికి తప్ప అందరికీ ఛాన్స్ ఇవ్వరు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విషయంపై అసంతృప్తితో ఉంటారు. ఇక ఏదైనా ఉంటే హరీష్, కేటీఆర్‌లకు చెప్పుకుంటారు. అయితే బీజేపీ దూకుడు పెరగడం, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్పిన దగ్గర నుంచి కేసీఆర్‌లో మార్పు వచ్చింది. దాదాపు 12 మంది ఎమ్మెల్యే టచ్‌లో ఉన్నారని, త్వరలోనే 10 ఉపఎన్నికలు వస్తాయని బండి సంజయ్ ఆ మధ్య కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ కామెంట్ టీఆర్ఎస్‌లో గుబులు రేపుతోంది…అసలు బీజేపీలోకి టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఏ ఎమ్మెల్యే ఎప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తారనే టెన్షన్ టీఆర్ఎస్ పెద్దల్లో కనిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యేలని…కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లెలా టీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నారట. కేసీఆర్ సైతం…ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలకు ఎంట్రీ ఇచ్చారట. ఈ మధ్య ఎమ్మెల్యేలని కూడా కలుస్తున్నట్లు సమాచారం..అలాగే వారు చెప్పే సమస్యలని కూడా విని, వారికి కావల్సిన పనులు చేసి పెడుతున్నారని టాక్.

అలాగే కొందరు బడా నేతలు కూడా బీజేపీలోకి వెళ్లడానికి చూస్తున్నారు…రాష్ట్ర స్థాయిలో నేమ్ ఉన్న లీడర్లని సైతం బీజేపీకి వెళ్లకుండా చూసేందుకు కేసీఆర్ బాగానే కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఇక మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు అన్నీ వర్గాల ప్రజలని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు…తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలతో కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు. అయితే ఏదైనా రాజకీయ అవసరం ఉన్నప్పుడు…కేసీఆర్ ఇలాంటి భేటీలు అవ్వడం ఎక్కువైంది.

ఆ మధ్య హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళితబంధు కోసమని చెప్పి…దళితులని ప్రగతి భవన్‌కు పిలిచి మరీ వారితో కలిసి భోజనం చేశారు. కానీ హుజూరాబాద్ ఉపఎన్నిక ఏమైందో తెలిసిందే. మరి సరికొత్త రాజకీయం చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు మునుగోడులో ఏ మాత్రం సక్సెస్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version