కొత్త రాజకీయాల పద వినోదాల వేళ.. పదవీ వినోదాల హేల..
వింటూ వింటూ వేడి వేడి నిట్టూర్పుల చెంత
అంటే.. అనే ఓ పరమ చెత్త సినిమాకు వెళ్లి వచ్చేక
మార్పులు అన్నవి సినిమాల్లోనూ మరియు రాజకీయాల్లోనూ
ఇంత త్వరగా అందినంత దూరంలో కొలిచినంత సులువు రీతిలో
జరగవు అని తెలిశాక.. ఈ వారాంతం కావాలొక సుఖాంతం
లేదా ఈ వారాంతం ఓ స్వచ్ఛ స్పాటిక గుణకం.
రాజకీయాలు సినిమాలు వేర్వేరుగా ఉంటాయి. ఉండాలి అని అనుకోవడం భ్రమ. ఉంటాయి అని చెప్పడం కూడా రంగులతో కూడిన నాటకం అయి ఉండవచ్చు. అది కూడా తప్పే వొచ్చు! ఇప్పుడు ఆదివారం వేళ వారాంతాన పొలిటికల్ సైన్స్ చదివే వీలుంటే, వారాంతాన మన నాయకుల రాట్లూ పాట్లూ అగచాట్లూ మరియు అవమానాలు ఎదురయి నిలుస్తాయి. ఆ విధంగా అవి ఆలోచింపజేయడమో, ఇబ్బంది పెట్టడమో లేదా ఇబ్బందులకు కారణం అయిన వారిని దూరం చేయడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. ఆ విధంగా వారం కేసీఆర్ అనే పొలిటికల్ పోట్ల గిత్త గురించి ఏమంటున్నారో ప్రజలు చూద్దాం.
ప్రజలు అనగా ఓటేసిన మరియు ఓటేయాలనుకుంటున్న మరియు ఓటేయకూడదు అని బెట్టుతో ఉన్న వారు అని అర్థం. ఆ విధంగా ఈ వారం ఈ వారాంతం ఓ సారి జాతీయ పార్టీ అనే నినాదంతో భారతీయ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరుతో ప్రజల ముందుకు వస్తున్న పోట్ల గిత్త కారణంగా ఏమయినా మార్పులు వస్తాయా ?
కొమ్ములు విసిరి రాజకీయం చేశారు కేసీఆర్. చేశాడు కేసీఆర్. రు లేదా డు. తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. తెచ్చారు కేసీఆర్. వచ్చిండన్నా తెచ్చిండన్నా వరాల మూట అన్నది ఆయనదే అన్నది తెలంగాణలో కొందరి మెజార్టీ లేదా మైనార్టీ పీపుల్ అభిప్రాయం. ఆ విధంగా ఆయనకు పేరు మరియు మర్యాద ఉన్నాయి. ఇక రాజకీయంలో ఆయన పేరుకు మరియు మర్యాదకు కొనసాగింపు ఇచ్చే విధంగా జాతీయ స్థాయి రాజకీయం ఒకటి చేయాలన్న గొప్ప ఆశతో (ఆశయంతో కాదు) బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ ఆశ అడియాశ ఈ ఆశ నిరాశ ఈ ఆశ పేరాశ ఈ ఆశ పటు నిరాశ అవుతుందో కాదో అన్నది తేల్చడం సులువు కాదు. ఇక కేసీఆర్ ఇకపై కేసీఆర్ ఏం చేసినా చేయకున్నా సంచలనం అయితే కాదు చలన సూత్రాలలో భాగం కూడా కాదు. అదొక ప్రాథమిక అవసరం. అథమ స్థాయి రాజకీయాలకు ఒకప్పుడు కేరాఫ్ గా ఉన్న నాయకులు లేదా వారి మనుషులు ఇప్పుడు పరివర్తన చెందినా ఫలితం ఉండదు. అలానే ఒకనాడు ఉద్యమం అంటూ తిరిగినా తిరుగాడిన కేసీఆర్ లాంటి లీడర్లకు నాటి జ్ఞాపకాలే నిండైన జీవితానికి సంతృప్త మరియు సంతోష కారకాలు. కావొచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు !
చందమామ కథలో చదివా రెక్కలు గుర్రాలుంటాయని అని పాడుకోనూ వచ్చు. ఆదివారం కదా అవీ ఇవీ చదివి మనసు పాడుచేసుకోక, చదివేక ఛీ పాడు అని అనుకోక.. కవితక్క మాదిరి ఈనాడు పదవీ వినోదం పూర్తి చేసి పోస్టులు వేయక హాయిగా బాధ్యత గల నాయకులూ బాధ్యతగా ఉండుండ్రి ! బీఆర్ఎస్ అనే కొత్త పార్టీకి స్వాగతం. ఘన – ద్రవ – వాయు – స్థితులలో ప్రావస్థల్లో కూడా స్వాగతమే ! శుభాకాంక్షలతో…
– రత్నకిశోర్ శంభుమహంతి, శ్రీకాకుళం