అవును! ఇప్పుడు టీడీపీలోని సీనియర్లు.. ఇదే మాట చెబుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా తెలుగు రా ష్ట్రాల ప్రజలతో కలిసిపోయి రాజకీయం చేస్తున్న టీడీపీలో ఇప్పుడున్న కుదుపు బహుశ గతంలో ఎప్పుడూ లేదని సీనియర్లే వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి రాజకీయంగానే కాకుండా నిర్మాణాత్మకంగాను, నాయకత్వ పరంగా కూడా కొన్ని కారణాలు , లోపాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. మితిమీరిన నాయకత్వ ప్రేమను పెంచుకున్న పార్టీ అధినేత చంద్రబాబు దిగువ స్థాయి నేతలపై ప్రేమను పెంచుకున్నారు. వారు చెప్పింది విన్నారు. వారు చెప్పినట్టే అధికారంలో ఉండగా చర్యలు తీసుకున్నారు.
అనేక ఆరోపణలు, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా చంద్రబాబు వాటిని పట్టించుకో కుండా దిగువ స్థాయి నేతలు ఇచ్చిన నివేదికల ఆధారంగా నే టికెట్లు కేటాయించారు. అయితే, ఇంటిలి జెన్స్ నివేదికలు సదరు నేతలపై ఇచ్చిన రిపోర్టులు వచ్చాక తనను తాను సరిచేసుకునేందుకు ప్రయత్నిం చినా.. చంద్రబాబు చేతులు అప్పటి కే కాలిపోయాయి. ఈ క్రమంలోనే ఆయన ఎన్నికల ప్రచారంలో వంగి వంగి దణ్నాలు పెట్టి.. మీ ఎమ్మెల్యే తప్పు చేసినంత మాత్రాన నన్ను, నా పార్టీని అధికారానికి దూరం చేయొద్దని ప్రజలను ప్రాధేయ పడ్డారు.
అయినప్పటికీ.. ప్రజలు విశ్వసించలేదు. దీంతో ఆయన ఘోరంగా ఓటమి పాలై అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఇక, ఇప్పుడు దాదాపు 30కి పైగా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకులు కానీ, పార్టిలో కార్యకర్తలను నిలబెట్టుకునే నాయకత్వం కానీ కనిపించడం లేదు. అంతేకాదు, అధినేత విషయాన్ని చూసుకున్నా.. అల్టర్‌నేట్ కనిపించడం లేదు. చంద్రబాబు తర్వాత ఈ పార్టీని నడిపించేది ఎవరు? అనే ప్రశ్నకు ఎవరూ ఇతమిత్థంగా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునేందుకు పార్టీ మారిపోతున్నారు.
ఈ క్రమంలోనే పార్టీ బలహీన పడుతోంది. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పార్టీని అబివృద్ధి చేసి పోయిన నేతల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా.. తనకు సమాంతరంగా పార్టీకి అధినేత అందించడం ద్వారానే ఇప్పుడు పార్టీ బాగుపడుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని పక్కన పెడుతున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారానే, ఆందోళనలకు పిలుపు ఇవ్వడం ద్వారానే తాను అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.