రాజధానిని తగలబెట్టింది ఎవరో, పాలకులకు తెలుసు…!

ఛీ నా దేశ రాజధాని తగలబడింది అని వార్తల్లో నేను చదవడం ఏంటి…? నాకు చాలా బాధగా ఉంది. దేశానికి రాజధాని ఒక గర్వకారణం. అవునా కాదా చెప్పండి…? దేశానికి రాజధాని అనేది నూటికి నూరు పాళ్ళు గర్వకారణం అనేది ప్రత్యేకంగా ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు కదా…? సరే యేవో రెండు చట్టాలు తెచ్చారు. అవి మంచివో చెడ్డవో… ఆ రెండు చట్టాలను అమలు చెయ్యాలని చూసారు.

దేశం మొత్తం ఆందోళనలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఝార్ఖండ్, తెలంగాణా. ఇలా అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ గోల తట్టుకోలేక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఆ చట్టాలను ఎందుకు అమలు చేయడం అవసరం లేదని చెప్పేసాయి ఆ రాష్ట్రాలు. అసెంబ్లీ తీర్మానం కూడా చేసాయి.

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన్నారు కాబట్టి, ఆధార్ కార్డ్ ఉన్న వాడికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పుకోవాల్సిన బాధ్యత అమలు చెయ్యాలి అనుకున్న వాళ్లకు ఉంది. అది మానేసి ఎం చేసుకుంటారో చేసుకోండి అని బాధ్యతగల వ్యక్తి మాట్లాడటం ఎంత వరకు పద్ధతి…? ఎంత వరకు సమంజసం చెప్పండి…? ఆలోచించే విధానం అందరిది ఒకటే ఉంటుందా…? ఒకడికి కోడి గుడ్డు తెల్లగా కనపడితే ఇంకొకడికి అదే కోడి గుడ్డు క్రీం కలర్ లో కనపడుతుంది.

అది వాడి తప్పు కాదు, ఆలోచించే విధానం తప్పు కాదు. వాడి దృష్టి లోపం అయి ఉండవచ్చు లేదా వాడికి అదే కరెక్ట్ అయి ఉండవచ్చు. అంతే గాని వాడు కోడి గుడ్డుని అవమానించాడా…? సరే నీదే కరెక్ట్ అనుకున్నప్పుడు అలా కాదు ఇలా అని చెప్పుకోవాలి. అది మానేసి గుడ్డు రంగు అదే ఏ౦ చేసుకుంటావో చేసుకో అంటే…? వాడు మనిషే, వాడికి కొన్ని భావాలు ఉంటాయి… వాడికి కోపాలు అన్నీ ఉంటాయి.

ఇప్పుడు కేంద్రం అదే చేస్తుంది. తాము ఏది చెప్తే అదే రైట్ అంటుంది. కాదు అన్న వాడిని దేశ ద్రోహి అంటుంది. వ్యతిరేకిస్తే దేశ ద్రోహి ఏ విధంగా అవుతాడు…? నేను దేశభక్తుడ్ని అని కాషాయ జెండా పట్టుకుని చెప్తే సరిపోతుందా…? ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో జరుగుతున్న అల్లర్ల విషయానికి వచ్చి చూస్తే, నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మీద కొందరు కక్ష గట్టారు. గెలుస్తాం అనుకున్న వాళ్ళు కక్ష గట్టారు.

అల్లర్లు రోజు రోజు కి పెరిగాయి. ఇవి హింస వరకు వెళ్ళాయి. ఆ హింస రోజు రోజుకి పెరిగిపోతుంది. హత్యలు జరుగుతున్నాయి. ముగ్గురు దేశభక్తులు వచ్చి రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసారు. సరే చేసారు. కొందరు రెచ్చిపోయారు. ఆ రెచ్చిపోయిన వాళ్ళు దేశ ద్రోహులు అన్నారు. సరే వాళ్ళు ద్రోహులే అయ్యారు. దేశ ద్రోహులు అయినప్పుడు దేశ భక్తుడు వాళ్ళను ఎందుకు రెచ్చగొట్టాడు…?

ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పిన జడ్జి ని ఎందుకు బదిలీ చేయించారు…? ఏ అధికారం తో విచారణ సగంలో ఉన్నప్పుడు బదిలీ చేయించారు. దేశభక్తుడు వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చెయ్యాల్సి వచ్చింది…? కేవలం ఒక ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రిని పదవి నుంచి దింపడానికి చేసిన కుట్ర ఇది అనే పరిస్థితి వచ్చింది. ఒక అధికారిని కుట్రలకు బలి చేసారు. ఇలాంటి మరణం మేము ఎప్పుడూ చూడలేదని డాక్టర్లు కూడా భయపడ్డారు.

400 కత్తి పోట్లతో ఒక అధికారిని హత్య చేసారు. మురుగు కాలవలో మృతదేహాన్ని పడేసారు. వందల కార్లు తగలబెట్టారు. కోట్ల ఆస్తి నష్టం జరిగింది. పరిస్థితి చేయి దాటిపోవడానికి కారణం ఎవరు..?? దేశ రాజధానిని తగలబెట్టింది ఎవరో పాలకులకు తెలుసు. పాలకులు విపక్షాల మీద ఆరోపణలు చేసినా పాలకులకు తెలుసు. కచ్చితంగా పాలకులకు తెలుసు. కాంగ్రెస్ నో వామపక్షాలనో దోషులను చేయడం తప్పు. బదిలీ చేసింది వాళ్ళు కాదు రెచ్చగొట్టింది వాళ్ళు కాదు.