సివిల్స్ : గెలిచిన అమ్మాయిలకు.. జేజేలు..

-

గెలుపు శిఖ‌రాల చెంత అమ్మాయిలు
వాళ్ల విజ‌యాలు.. ఇప్ప‌టిదాకా
ఎన్నో.. ఇక‌పై కూడా ఎన్నో !
ఆడ‌బిడ్డ‌ల విజయాల‌ను చూస్తే దేశం గ‌ర్విస్తుంది
నేల పుల‌కిస్తుంది.. అవ‌రోధాలు దాటిన గెలుపులే
ప్రామాణికాలు అవుతాయి.. రేప‌టి వేళ మంచిని స్థిరం చేస్తాయి… 

అమ్మాయిల గెలుపు కోసం అంతా ప‌రిత‌పిస్తున్నారు. ఆడ బిడ్డ‌లలో కొంద‌రు ఒంటరి అయిపోయిన ఘ‌ట‌న‌లు కొన్ని ఉన్నాయి క‌దా ! వాటిని దూరం చేసే గెలుపు నీరాజ‌నం అందుకుంటోంది. తెలుగింటి బిడ్డ‌ల విజ‌యాల‌ను చూసి మ‌న నాయ‌కులు పొంగిపోతున్నారు. మ‌న ఇంటి బిడ్డ‌లంతా మ‌రింత ఆనందాల‌కు ఆన‌వాలు కావాలి. అదేవిధంగా యూపీ అమ్మాయి శ్రుతి శ‌ర్మ అనే ఓ గెలుపు శిఖ‌రం కూడా ఇవాళ స్ఫూర్తికి ఆన‌వాలు కావాలి. అవును! ఆడ‌బిడ్డ‌లు చ‌దువు నిజంగానే గొప్ప మార్పున‌కు శ్రీ‌కారం దిద్దుతుంది. మ‌న పాల‌కులు కూడా కోరుకునేది ఇదే!

ఓ వైపు భార‌త్ కొన్ని బాధిత స్వ‌రాల‌ను మోస్తున్నా ఇటువంటి విజ‌యాలు వాటిని దూరం చేస్తాయి. తెలుగు తేజాలు వంద‌లోపు ప‌ది మంది నిల‌బ‌డిన వైనం కూడా త‌ల్లిదండ్రుల ఆత్మ విశ్వాస ధోర‌ణులు పెంచుతాయి. అమ్మాయిల‌తో పాటు అబ్బాయిలు కాదు కాదు ఈ సారి అమ్మాయిల వెనుకే అబ్బాయిలు. మంచిదే కొన్ని ప‌రిణామాల కార‌ణంగా పోటీ వ‌స్తుంది. కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా, స‌వాళ్ల కార‌ణంగా మ‌రిన్ని కొత్త దారుల అన్వేష‌ణ ఒక‌టి సాధ్యం అయి తీరుతుంది. ఆ విధంగా నిన్న‌టి  సివిల్స్ ఫ‌లితాల్లో తొలి మూడు ర్యాంకులూ అమ్మాయిల‌వే !

తొలి స్థానంలో శ్రుతి శ‌ర్మ అటు త‌రువాత స్థానాల‌లో   అంకితా అగ‌ర్వాల్, గామినీ సింగ్లా నిలిచి గెలిచారు. వారంద‌రికీ తెలుగు నేల త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు మ‌న ముఖ్య నాయ‌కులు. ఇప్ప‌టికే తెలుగు అమ్మాయిలు సివిల్స్ కు ఎంపికైన అమ్మాయిలు వివిధ ప్రాంతాల‌లో ప‌నిచేస్తూ, అంకింత భావంతో ప‌నిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అమ్మాయిల‌తో పాటే అబ్బాయిలు కూడా త‌మ విధి నిర్వ‌హ‌ణ‌కు మంచి ప్రాధాన్యం ఇస్తూ తెలుగు జాతి గౌర‌వాన్ని నిలుపుతున్నారు. కొంద‌రు పేద‌రికాన్ని స‌వాలు చేసి నిలుస్తుంటే, మ‌రికొంద‌రు త‌మ వెనుక‌బాటును ప్ర‌శ్నిస్తూ ముందుకు వెళ్తూ విజ‌య ప‌తాక‌లు అందుకుంటూ స్ఫూర్తి అందించ‌డం ఇవాళ స్మ‌రించ‌ద‌గ్గ విష‌యం.
సివిల్స్ లో 13 వ ర్యాంకు సాధించిన ప్రియంప‌ద మాదాల్క‌ర్ మాట్లాడుతూ రెండేళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం ఇది అని చెబుతున్నారు. హైద్రాబాద్ లో స్థిర‌ప‌డిన ఈ ముంబ‌యి మూలాలున్న అమ్మాయి 2020 జూలై నుంచి  సివిల్స్ పైనే దృష్టి నిలిపి అనుకున్న ఫ‌లితం సాధించారు. బీటెక్ త‌రువాత బెంగ‌ళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసి, ఆరేళ్ల పాటు ఇన్విస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ప‌నిచేసి, అటుపై వివాహం అనంత‌రం ఇటుగా వ‌చ్చి సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. సోషియాల‌జీని ఆప్ష‌నల్ గా  ఎంచుకుని విజేత అయ్యారు. చెప్పానుగా అమ్మాయిలు వెంటే అబ్బాయిలు అని ఆ విధంగా చాగ‌ల‌మ‌ర్రికి చెందిన (ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా) యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంకు సాధించారు. ఉమ్మ‌డి విశాఖ‌కు చెందిన న‌ర్సీప‌ట్నం కుర్రాడు మౌర్య భ‌ర‌ద్వాజ 28 వ  ర్యాంకు సాధించి ఉత్త‌రాంధ్ర‌కే గ‌ర్వ‌కార‌ణం అయ్యారు. అదేవిధంగా మ‌న తెలుగు నేల‌కు చెందిన నెల్లూరు అమ్మాయి సంజ‌నా సిన్హా 37వ ర్యాంకు సాధించారు. ఉమ్మ‌డి క‌ర్నూలు నుంచే కోవెల కుంట్ల కుర్రాడు గ‌డ్డం సుధీర్ కుమార్ 69 వ ర్యాంకు సాధించి, విజేత‌గా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news