త్వరలో యూఏఈలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ అనంతరం వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా కోహ్లి తప్పుకుంటాడని ఒక్కసారిగా వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లి వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా తప్పుకుంటాడని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. మీడియా అనేక విధాలుగా వార్తలను ప్రచారం చేస్తుందని, వాటిల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉంటాడని, అతను కెప్టెన్సీ నుంచి తప్పుకోడని ధుమాల్ తెలిపారు. అయితే టెస్ట్‌ల పరంగా చూస్తే కోహ్లి సక్సెస్ రేట్ బాగానే ఉంది కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లి విఫలమవుతున్నాడు. ముఖ్యమైన ఐసీసీ టోర్నీలలో టీమిండియా చతికిల పడుతోంది. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని ఒక్కసారిగా మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. వాటిపై ధుమాల్ పై విధంగా వ్యాఖ్యానించారు.
అయితే నిజానికి కోహ్లి కన్నా రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత్ మంచి సక్సెస్ ను సాధించింది. రోహిత్ సారథ్యంలో భారత్ గతంలో పలు వన్డే, టీ20 సిరీస్‌లలో నెగ్గింది. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ ఏకంగా 5 టైటిల్స్ సాధించాడు. అందువల్లే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్‌నే కెప్టెన్‌గా నియమించాలనే డిమాండ్ ఇప్పటికీ వినిపిస్తోంది. కానీ బీసీసీఐ ఆ వార్తలను కొట్టి పారేయడం విశేషం.