మరో రెండు రోజుల్లో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఎప్పటిలాగే జెంగా ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంటి ముందు జెండా ఎగురవేస్తున్నాం కదా.. స్వాతంత్ర్యం రాక ముందు జాతీయ జెండాకు స్వేచ్ఛ లేదు. రెపరెపలాడుతూ ఆ జెండాను ఎగరవేసేందుకు ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. రక్తంఏరులై పారింది. చేతిలో మన జెండాను చూసినా బ్రిటీష్ వాళ్లు ఊరుకునేవాళ్లు కాదు. ఎక్కడ మన జెండా ఎగురువేస్తే అక్కడ అది తీసి పడేసి బ్రిటీష్ వాళ్లు వాళ్ల జెండాను పెట్టేవాళ్లు. స్వాంతంత్ర్య పోరాటంలో జెండాకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన జాతీయ జెండా గురించి మీకు తెలియని కొన్ని విషయాలు చూద్దామా..!
స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప పాత్ర
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేపట్టిన స్వాతంత్య్రోద్యమంలో మూడు రంగుల జెండాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ జెండా చేతబూని, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, సత్యాహింసలు ఆయుధాలుగా, మహాత్మాగాంధీ నాయకత్వంలో అశేష భారతావని స్వాతంత్య్రం మా జన్మహక్కని నినదిస్తూ, ఉద్యమ ప్రస్థానంలో ముందడుగు వేసింది. దాదాపు 200 ఏళ్ల వలస పాలనకు చరమగీతం పాడుతూ ఆఖరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సాధించుకుంది.
మన జాతీయ జెండా విశేషాలు..
మన మూడు రంగుల జెండాను మొదటి సారి 1906 ఆగస్ట్ 7 తేదీన కోల్ కతాలోని పార్సీ బేగన్ స్క్వేర్ లో ఎగురవేశారు. అప్పుడు ఆ జెండాలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ప్రధాన రంగులుగా ఉన్నాయి. 1931లో జరిగిన కాంగ్రెస్ మహాసభ మూడు రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించింది. ఆ సమయంలో ఆ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో చరఖా ఉంది.
ఆ తరువాత ఆ జెండాకు కొన్ని మార్పులు చేశారు. మూడు రంగుల మధ్యలో, చరఖా స్థానంలో అశోక చక్రంను పొందుపర్చారు. ఈ జెండాను 1947 జులై 22న అధికారికంగా జాతీయ జెండాగా ఆమోదించారు. ఈ జెండానే 1947 ఆగస్ట్ 15న ఎగురవేశారు. మనం ఉపయోగిస్తున్న జాతీయ జెండాను మొదట తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మధ్య అశోక చక్రంతో జెండాను రూపొందించారు.
ఒకప్పుడు ఎన్నో ఆంక్షలు..
ఒకప్పుడు జాతీయ జెండాను ఎగురవేయడానికి కొన్ని ఆంక్షలు ఉండేవి. కొన్ని ఎంపిక చేసిన ముఖ్యమైన రోజుల్లోనే జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం ఉండేది. కానీ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ దాదాపు పదేళ్ల పాటు న్యాయపోరాటం చేసి ఆ ఆంక్షలను తొలగిస్తూ, సుప్రీంకోర్టు 2004 జనవరి 23న తీర్పునిచ్చింది.
రాజ్యాంగంలో అధికరణ..
జాతీయ జెండాకు సముచిత గౌరవం ఇస్తూ, రాజ్యాంగంలోని 19(1) (a) అధికరణ పరిధిలో, జాతీయ జెండాను ఎగురవేయగలగడం భారతీయ పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రంగులు దేనికి ప్రతీక..
జాతీయ జెండాలోపై భాగంలో ఉన్న కాషాయ రంగు శక్తికి, ధైర్యానికి ప్రతీకగా.. మధ్యలో ఉన్న శ్వేత వర్ణం శాంతికి, సత్యానికి గుర్తుగా.. కింది భాగంలో ఉన్న ఆకుపచ్చ వర్ణం ప్రగతికి, పవిత్రతకు తార్కాణంగా భావిస్తారు. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి ప్రతీకగా పేర్కొంటారు.
మనతో పాటే ఈ దేశాలకు కూడా..
ఆగస్టు 15న మరో ఐదు దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటాయి. అవి బహ్రెయిన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లీచ్టెన్ స్టీన్.