తెలంగాణ రాష్ట్రం సాధించుకుని విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. జూన్ 2వ తేదీన పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యారోగ్య రంగంలో గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని.. భవిష్యత్‌లో చేయబోయే అభివృద్ధి గురించి ప్రజలకు వివరించనున్నారు.
నేడు వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలోనే తెలంగాణ వైద్యారోగ్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలతో సర్కార్ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. దేశానికే రోల్ మోడల్‌గా మారిన ఆరోగ్య తెలంగాణ మోడల్ మనదని వెల్లడించారు. “స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం.. ప్రతీ ఉషోదయం ఆరోగ్య భాగ్యోదయం” అంటూ ట్వీట్ చేశారు.
స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం..
ప్రతీ ఉషోదయం ఆరోగ్య భాగ్యోదయం.#తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 pic.twitter.com/mn04PpOnyj— Harish Rao Thanneeru (@BRSHarish) June 14, 2023