కరోనా సమయంలో ఆక్సిజన్ లేక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఆయన గురువారం మాట్లాడారు. సాయం చేసే స్థితి నుంచి చిన్న దేశాల సాయం పొందే పరిస్థితి భారత్‌కు వచ్చిందని అన్నారు. అవసరమైన ఆక్సిజన్‌ను కేంద్రం యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలని ఈటల కోరారు. అలానే వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి యుద్ధ ప్రాతిపదికన పెరగాలన్నారు. కేంద్రం కేటాయించే వ్యాక్సిన్లను బట్టి రాష్ర్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసారు.
18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలని అయితే రెండు కంపెనీల ఉత్పత్తి 6 కోట్లే అంటున్నారని… ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని ఈటల డిమాండ్ చేశారు. 3.5 కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నామన్న మంత్రి… వీటిని దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఇక రేపటి నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్‌లు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. . హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామని… హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇక బీజేపీ నేతలపై మంత్రి ఈటల మండిపడ్డారు. బీజేపీ నేతలు బాధ్యతారహిత్యంతో మాట్లాడుతున్నారని.. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రాన్ని అడిగితే కానీ 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేటాయించిందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. తెలంగాణలో 4 రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స జరుగుతోందని అన్నారు.