కరోనా రక్కసిని అంతమొందించడానికి దేశంలో పలుప్రాంతాలలో పలు రకాల ప్రార్థనలు, పూజలు, హోమాలు చేస్తున్నారు. ఎలాగనైనా కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించాలని ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంలో మార్చి 23 సోమవారం కరోనా వైరస్ నివారణార్థం, లోక కల్యాణార్థం వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో హోమాలు నిర్వహించారు. దేవాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు రాజన్న ఆలయ కల్యాణ మండపంలో మహామృత్యుంజయ, సుదర్శన, ధన్వంతరి హోమాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు వేదమంత్రాలతో మార్మోగాయి.
ఉదయం 5 గంటలకు శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామికి ప్రాతఃకాల పూజ అనంతరం ఆలయ కల్యాణ మండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు గణపతిపూజ, రుత్విక్ వరణం, ఫుణ్యాహవాచనం, పంచగవ్య మిశ్రణం, మండపారాధన, కలశ స్థాపన, నవగ్రహ అష్టదిక్పాలక పూజ, మాతృకా పూజ, వాస్తు పూజ, క్షేత్రపాలక పూజ, మహా మృత్యుంజయ, ధన్వంతరి, సుదర్శన ఆవాహన పూజలు, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు.హోమ కార్యక్రమంలో జపానుష్టానాలు, ఆవాహితా దేవాతా హోమం, చతుర్వేద హవనం, సూర్యనారాయణ హవనం, మహామృత్యుంజయ సంపుటీకరణ రుద్రహవనం, ధన్వంతరీ హవనం, సుదర్శన హవనం వైభవంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం మహామృత్యుంజయ కలశ జలాన్ని మంగళవాయిద్యాల మధ్య ఆలయంలో ప్రదక్షిణా పూర్వకంగా తిరిగి శ్రీ రాజరాజేశ్వర స్వామికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు, ఆలయ కార్యనిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీ