కరోనా వైరస్ ఏమోగానీ ఈసారి ఐపీఎల్ టోర్నీ జరుగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ విదేశీ ఆటగాళ్లకు ఏప్రిల్ 15వ తేదీ వరకు వీసాలను రద్దు చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే ఈ సారి ఐపీఎల్‌ను రద్దు చేసుకోవాలని కేంద్రం నిర్వాహకులకు సూచించింది. అయితే విదేశీ ఆటగాళ్లకు దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రేక్షకులు లేకుండా అయినా స్టేడియంలలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ కేంద్రాన్ని కోరుతోంది. ఇక ఈ గ్యాప్‌లో ఢిల్లీ ప్రభుత్వం ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై బాంబ్ పేల్చింది.
ఢిల్లీలో ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శుక్రవారం మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన తెలిపారు. ఇక ఐపీఎల్ మాత్రమే కాకుండా క్రీడలకు సంబంధించిన ఏ ఈవెంట్‌కు అయినా సరే.. అనుమతి ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణపై తర్జన భర్జనలు పడుతోంది. గతంలో పలు మార్లు భారత్‌లో ఎన్నికలు జరిగినప్పుడు విదేశాల్లో ఐపీఎల్‌ను సాఫీగా నిర్వహించారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో వారికి ఆ చాన్స్ లేదు. దీంతో ఏం చేయాలా.. అని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇక ఈ విషయంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.